ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకోవాలి
అనంతపురం జేఎన్‌టీయూ వీసీ హెచ్.సుదర్శనరావు
పులివెందుల రూరల్ : విద్యార్థులు ఉద్యోగం సంపాదించడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి చేరుకోవాలని అనంతపురం జెఎన్‌టీయూ వైస్ చాన్స్‌లర్ హెచ్.సుదర్శనరావు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక జెఎన్‌టీయూ కళాశాలలో ప్రిన్సిపల్ విష్ణువర్థన్ ఆధ్వర్యంలో కళాశాల వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. అనంతపురం వీసీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీసీ హెచ్.సుదర్శనరావు స్వీయ అభ్యసన అవగాహన, నైపుణ్యాభివృద్ధి గోల్ సెట్టింగ్, అకడమిక్ క్రెడిట్ డిపాజిట్ స్కీం, మల్టీ డిసిప్లినరీ, ఇంటర్ డిసిప్లినరీ, సాంకేతికత, వ్యాల్యూ ఆడెడ్ కోర్సులపై అవగాహన కల్పించారు. విద్యార్థులు సబ్జెక్టు విషయాలపైనే కాక సాంకేతిక నైపుణ్యత, విలువలు, విద్యా సృజనాత్మకతతో వివిధ రంగాలలో నైపుణ్యాభివృద్ధిని సంపాదించి కళాశాలను అగ్రస్థానంలో ఉంచాలన్నారు. ప్రిన్సిపల్ ఆచార్య డి.విష్ణువర్ధన్ కళాశాల వార్షిక అభివృద్ధి, విద్యా రంగాలలో సాధించిన ప్రగతిని వివరించారు. అలాగే వైస్ ప్రిన్సిపల్ ఆచార్య శేష మహేశ్వరమ్మ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, 2020లో విద్యా ఆవశ్యకతను తద్వారా సాధించదగిన ప్రగతిని వివరించారు. స్పోర్ట్స్ ఇంచార్జ్ డాక్టర్ ఏ. దామోదర్ రెడ్డి విద్యార్థులు క్రీడా రంగాలలో సాధించిన ప్రగతిని వివరించారు. కళాశాల అకడమిక్ మెరిట్ అవార్డులను, క్రీడా అవార్డులను విజేతలకు బహుకరించారు. కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


