చక్రాయపేట మండలంలో టీడీపీ నాయకుల వీరంగం
సాక్షి టాస్క్‌ఫోర్స్ : చక్రాయపేట మండలం సురభి గ్రామం నాగలగుట్టపల్లెలో గురువారం టీడీపీ నాయకులు బీభత్సం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ మండల ఉపాధ్యక్షుడిగా నియమితుడైన నాగలగుట్టపల్లెకు చెందిన రాంబాబు ఫ్లెక్సీలు కట్టి కేక్ కత్తిరించడం జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ నేతలు ఈ దారుణానికి తెగబడ్డారు. వివరాలిలా ఉన్నాయి. రాంబాబును వైఎస్సార్‌సీపీ మండల ఉపాధ్యక్షుడిగా నియమించడంతో ఫ్లెక్సీలు కట్టి కేక్ కత్తిరించి బుధవారం సాయంత్రం సంబరాలు జరుపుకున్నారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని కొందరు టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ నేతల ఫ్లెక్సీలు తొలగించాలని పోలీసులపై వత్తిడి తెచ్చారు. దీంతో పోలీసులు వైఎస్సార్‌సీపీ నేతలను పిలిచి ఫ్లెక్సీలు తీయాలని ఆదేశించారు. దీంతో వైఎస్సార్‌సీపీ నేతలు కూడా టీటీపీ నేతల ఫ్లెక్సీలు తీస్తే తాము తీసేస్తామని చెప్పారు. దీంతో టీడీపీ శ్రేణులు బయట ప్రాంతాలకు చెందిన వ్యక్తులను రప్పించుకొని నాగలగుట్టపల్లెలో ఈలలు కేకలు వేస్తూ మారణాయుధాలు చేతబట్టి భయోత్పాతం సృష్టిస్తూ వైఎస్సార్‌సీపీ నేతల ఫ్లెక్సీలను చించివేశారు.అక్కడే ఉన్న మండల ఉపాధ్యక్షుడు రాంబాబుపై దాడి చేశారు.
పోలీసులకు ఫిర్యాదు
నాగలగుట్టపల్లెలో గురువారం జరిగిన సంఘటనకు సంబంధించి బాదితుడు దాసరి రాంబాబు చక్రాయపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన దాసరి ఆంజనేయులు, మురికినాటి సాయిప్రసాద్, పగడాల పరమేశ్వర, తుపాకుల సుదర్శన్, బోర్‌వెల్ రామాంజులరెడ్డి, ఎద్దుల చంద్ర, తాళ్లపల్లె ప్రవీణ్‌తో పాటు మరికొందరు మారణాయుధాలతో వచ్చి తనపై దాడి చేసి ఫ్లెక్సీలు చించేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తమ్ముడు వచ్చి కాపాడకపోతే తనను చంపేసేవారని తెలిపారు.
వైఎస్‌ఆర్‌సీపీ మండల ఉపాధ్యక్షుడు రాంబాబుపై దాడి
వైఎస్సార్‌సీపీ నేతల ఫ్లెక్సీల చించివేత
చక్రాయపేట మండలంలో టీడీపీ నాయకుల వీరంగం


