మతి స్థిమితం లేని మహిళ కుటుంబ సభ్యులకు అప్పగింత
కడప, అర్బన్ : ఇంటినుంచి బయటకు వచ్చి తిరిగి ఇంటికి ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితిలోని మహిళను గుర్తించి తిరిగి వారి కుటుంబం చెంతకు చేర్చి శభాష్ పోలీస్. అని ప్రజల మన్ననలు పొందారు బ్లూ కోల్ట్ పోలీసులు.. వివరాల్లోకెళితే... కడప రామాంజనేయపురానికి చెందిన సత్రమ్మ అనే మతి స్థిమితం సరిగా లేని మహిళ గత రెండు రోజుల నుంచి చిన్నచౌకు పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండేది. ఈ నేపథ్యంలో బ్లూ కోల్ట్(–10) విధులలో ఉన్న కానిస్టేబుల్ బి. రాజారమేష్ నాయక్(పి.సి 2412), హోమ్‌గార్డ్ సురేష్( హెచ్.జి 138) లు మంగళవారం చిన్న చౌకు పరిధిలోని పాత బైపాస్‌లో తిరుగుతున్న మహిళను గుర్తించి చిన్నచౌకు సీఐ ఓబులేసుకు సమాచారమిచ్చారు. చిన్న చౌకు సీఐ ఓబులేసు సూచన మేరకు మధ్యాహ్నం నుంచి ఆమె కుటుంబీకుల ఆచూకీ కోసం బ్లూ కోల్ట్ సిబ్బంది శ్రమించారు. వాట్సాప్ ద్వారా మహిళ ఫొటోను విస్తృతంగా ప్రచారం చేశారు. దాదాపు 5 గంటల తర్వాత ఎట్టకేలకు రామాంజనేయపురానికి చెందిన మహిళగా గుర్తించి భర్త పరశురామ్‌కు అప్పగించారు. తన భార్యను తిరిగి తన వద్దకు అప్పగించేందుకు శ్రమించిన పోలీస్ సిబ్బందికి పరశురామ్ కృతజ్ఞతలు తెలిపారు.


