కొత్త పెన్షన్ బిల్లు ఉపసంహరించుకోవాలి
కడప ఎడ్యుకేషన్ : కొత్త పెన్షన్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఎస్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి డిమాండ్ చేశారు. కడప ఎస్‌టీయూ భవన్‌లో జిల్లా అధ్యక్షుడు ఎస్‌ఎండీ.ఇలియాస్‌బాషా అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ‘ఆర్టికల్–14’ను ఉల్లంఘించడం సరికాదన్నారు. సిపిఎస్/జిపిఎస్ స్థానంలో ఆమోద యోగ్యమైన పెన్షన్ విధానం తెస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మెమో 57 మేరకు పాత పెన్షన్ వర్తింప చేయాలన్నారు. ఏఐఎస్‌టీఎఫ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కత్తినరసింహారెడ్డి మాట్లాడుతూ 12 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లించాల్సిన 11వ పీఆర్సీ, డీఎ, సరెండర్ లీవ్, సీపీఎస్ బకాయిలు కలిపి రూ.23వేల కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న మూడు విడతల డీఏ మంజూరుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర సంయుక్త అధ్యక్షుడు కె.సురేష్‌బాబు మాట్లాడుతూ ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్య పరిష్కరించి, పర్యవేక్షణాధికారి పోస్టులను భర్తీచేయాలన్నారు. రాష్ట్ర నాయకులు పిల్లిరమణారెడ్డి, కంబం బాలగంగిరెడ్డి, రషీద్‌ఖాన్ మాట్లాడుతూ 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు పది శాతం, 75 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు 15 శాతం అడిషనల్ క్వాంటం పెన్షన్ అమలుచేయాలని కోరారు. అనంతరం బాబు జగ్జీవన్ రామ్ జయంతి, వీణా విజయరామరాజు వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో ఎన్.సంగమేశ్వర్‌రెడ్డి, శివశంకర్, గురుకుమార్, దాదా పీర్, గురు ప్రసాద్, రవిశంకర్‌రెడ్డి, కొత్తపల్లి శ్రీను, వాకా చంద్రశేఖర్, చెన్నకేశవరెడ్డి మహబూబ్ బాషా, రామ్మోహన్, జిల్లా, మండల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


