విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తనపై విచారణ
బద్వేలు అర్బన్ : పట్టణంలోని శివానగర్‌లో గల లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో గత నెల 29న 4వ తరగతి విద్యార్థిని పట్ల అన్వర్‌బాషా అనే ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై మంగళవారం ఉప విద్యాశాఖాధికారి రాజగోపాల్‌రెడ్డి విచారణ చేపట్టారు. జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ విచారణలో భాగంగా తొలుత పాఠశాలకు వెళ్లి పాఠశాల కరస్పాండెంట్‌ను, తోటి ఉపాధ్యాయులను విచారించారు. అలాగే అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు ఎన్ని నెలలుగా పాఠశాలలో పనిచేస్తున్నాడనే విషయంపై ఆరాతీశారు. అనంతరం విద్యార్థిని తల్లిదండ్రులను విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని, విచారణలో సేకరించిన వివరాలను నివేదిక రూపంలో జిల్లా విద్యాశాఖాధికారికి అందజేస్తామని తెలిపారు. ఆయన వెంట ఎంఈఓలు చెన్నయ్య, రఘురాములు, సిబ్బంది పాల్గొన్నారు.


