మత్తు రహిత సమాజమే లక్ష్యంగా..
సూర్యాపేటటౌన్ : ఎక్కడ జనసందోహం ఉన్నా.. ఎక్కడ పెద్ద జాతరలు, వారసంతలు ఉన్నా నల్లటి దుస్తులు ధరించి మెడలో పుర్రెల దండ వేసుకొని నో డ్రగ్స్.. సేవ్ లైఫ్ అంటూ ఫ్లెక్సీని పట్టుకొని అక్కడ కనిపిస్తారు ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. సమాజంలో కనీసం ఒక్కరినో.. ఇద్దరినో మత్తు పదార్థాల బారి నుంచి విముక్తి కల్పించడమే తన కర్తవ్యంగా భావించి పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించడానికే పరిమితం కాకుండా సమాజాన్ని చైతన్యపరిచేందుకు యాత్ర ప్రారంభించారు సూర్యాపేటకు చెందిన ప్రభుత్వ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరెంట్ల ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఆయన రెండేళ్లుగా మత్తు పదార్థాల వ్యతిరేక ప్రచారకర్తగా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. శుక్రవారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
మూడేళ్ల క్రితం మద్యానికి బానిసైన తన ప్రాణ స్నేహితుడు అనారోగ్యంతో మృతి చెందడం ప్రభాకర్‌ను తీవ్రంగా కలిచివేసింది. మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత బానిసై ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఆయనను ఆలోచింపజేశాయి. సమాజంలో అవగాహన పెంచాలని సంకల్పించిన ఆయన అప్పటి నుంచి మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారు.
ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రభాకర్ ప్రత్యేక వేషధారణను ఎంచుకున్నారు. నల్లటి దుస్తులు ధరించి, మెడలో పుర్రెల బొమ్మలతో చేసిన దండ వేసుకుని నో డ్రగ్స్..సేవ్ లైఫ్ అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సంప్రదాయ పండగలు, హిందూ, ముస్లిం, క్రైస్తవుల పండుగల సమయంలో ఆయా మతస్తుల వేషధారణతో మత్తు జోలికి వెళ్లొదని వినూత్నంగా అవగాహన కల్పిస్తున్నారు. ఆయన వేషధారణ చూసిన వారంతా ఆసక్తిగా దగ్గరకు రావడంతో మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.
సెలవు దొరికిన ప్రతిసారి ప్రభాకర్ ప్రజలు ఎక్కువగా గుమికూడే ప్రదేశాలను ఎంచుకుంటారు. వారసంతలు, జాతరలు, సభలు, ప్రత్యేక కార్యక్రమాలు, బహిరంగ ప్రదేశాల్లో తన వినూత్న ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. యువతతోపాటు పెద్దలకు కూడా మత్తు పదార్థాల దుష్పరిణామాలను వివరిస్తూ చైతన్యం తీసుకొస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో బైక్ యాత్రతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కూడా మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన చేస్తున్న ఈ సేవకు ప్రజలు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఫ పుర్రె దండతో మత్తుపై యుద్ధం
ఫ నల్లటి దుస్తుల్లో
మత్తు వ్యతిరేక సందేశం
ఫ నో డ్రగ్స్.. సేవ్ లైఫ్ అంటూ
చైతన్య యాత్ర
ఫ మత్తు రహిత సమాజానికి
ప్రభుత్వ ఉపాధ్యాయుడు
రాచకొండ ప్రభాకర్ కృషి
నేడు అంతర్జాతీయ
మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం
ప్రతి ఏడాది జూన్ 26న నిర్వహించే అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రభాకర్ చేస్తున్న సేవ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడమే తన లక్ష్యమని, మత్తు రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఆయన పిలుపునిస్తున్నారు.


