‘బ్యూటీ’ శిక్షణతో ఉపాధి బాట | - | Sakshi
Sakshi News home page

‘బ్యూటీ’ శిక్షణతో ఉపాధి బాట

Jun 26 2026 7:39 AM | Updated on Jun 26 2026 7:39 AM

విజయవంతంగా ముగిసిన ‘సాక్షి’

మైత్రి మహిళ బ్యూటీషియన్‌ కోర్సు

నెల రోజుల పాటు థియరీ,

ప్రాక్టికల్‌ విధానంలో శిక్షణ

శిక్షణ పూర్తి చేసుకున్న

మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానం

రామగిరి (నల్లగొండ) : మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి, స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో ‘సాక్షి’ మైత్రి మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత బ్యూటీషియన్‌ శిక్షణా కార్యక్రమం గురువారం విజయవంతంగా ముగిసింది. నల్లగొండ పట్టణంలోని తిరుమలనగర్‌ కాలనీలో గల తన్విక బ్యూటీపార్లర్‌ సౌజన్యంతో మే 25 నుంచి జూన్‌ 24 వరకు నెల రోజుల పాటు ఈ శిక్షణను నిర్వహించారు. ఈ శిక్షణలో మహిళలకు బ్యూటీషియన్‌ రంగంలో అవసరమైన అంశాలపై ప్రాక్టికల్‌ మరియు థియరీ విధానంలో నిపుణులు పూర్తి అవగాహన కల్పించారు. ఈ శిక్షణకు హాజరైన మహిళలు బ్యూటీ పార్లర్‌ నిర్వహణకు సంబంధించిన ఐబ్రోస్‌, మేనిక్యూర్‌, పెడిక్యూర్‌, వ్యాక్సింగ్‌. బ్లీచింగ్‌, స్కిన్‌ కేర్‌, ఫేస్‌ ప్యాక్స్‌, హెయిర్‌ మసాజ్‌, హెన్నా ప్రిపరేషన్‌, వివిధ రకాల హెయిర్‌ కట్స్‌, హెయిర్‌ స్టైల్స్‌, సారీ డ్రేపింగ్‌, బేసిక్‌ పింపుల్‌ ట్రీట్‌మెంట్‌, రకరకాల మేకప్స్‌, కమ్యూనికేషన్‌ అండ్‌ సెల్ఫ్‌ గ్రూమింగ్‌ నేర్చుకున్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. మహిళలు ఇక్కడ నేర్చుకున్న నైపుణ్యాలతో సొంతంగా ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని సూచించారు. కోర్సు పూర్తి చేసిన మహిళలకు సాక్షి బ్రాంచ్‌ మేనేజర్‌ రుక్మాధర్‌ ముఖ్యఅతిథిగా హాజరై సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఫొటోగ్రాఫర్‌ కంది భజరంగ్‌ప్రసాద్‌, తుమ్మనగోటి వెంకట్‌, శిక్షణా సిబ్బంది పాల్గొన్నారు.

సొంతంగా

బ్యూటీపార్లర్‌ పెడతా

బ్యూటీషియన్‌ కోర్సు నేర్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ బయట ఫీజు చాలా ఎక్కువగా ఉంది. ‘సాక్షి’ మైత్రి మహిళా విభాగం వారు ఉచితంగా, ఎంతో ఓపిగ్గా అన్ని అంశాలు నేర్పించారు. ముఖ్యంగా బ్రైడల్‌ మేకప్‌, హెయిర్‌ స్టైల్స్‌ బాగా అర్థమయ్యాయి. త్వరలోనే సొంతంగా చిన్న బ్యూటీపార్లర్‌ పెట్టి ఆర్థికంగా నిలదొక్కుకుంటాను.

– పర్వీన్‌, సూర్యాపేట

ప్రాక్టికల్స్‌తో సులువుగా అర్థమైంది

థియరీ మాత్రమే కాకుండా ప్రతిఒక్కరితో ప్రాక్టికల్స్‌ చేయించడం వల్ల భయం పోయింది. ఐబ్రోస్‌ త్రెడ్డింగ్‌, వ్యాక్సింగ్‌ చేయడం చాలా ఈజీగా నేర్పించారు. శారీ డ్రేపింగ్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ క్లాసెస్‌ కూడా మాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ఈ శిక్షణ మాకు ఎంతో ఉపయోగపడింది. – మానస, చిట్యాల

స్వయం ఉపాధికి గొప్ప అవకాశం

స్వయం ఉపాధి పొందడానికి ఈ కోర్సు నాకు బాగా హెల్ప్‌ అవుతుంది. స్కిన్‌ కేర్‌, పింపుల్‌ ట్రీట్‌మెంట్‌, ఫేస్‌ ప్యాక్స్‌ వంటి ముఖ్యమైన విషయాలపై మంచి అవగాహన వచ్చింది. మాకు ఇంత మంచి అవకాశం కల్పించిన సాక్షి బృందానికి ధన్యవాదాలు.

– కవిత, కనగల్‌

ఉపాధి అవకాశాలు పొందాలి

ప్రస్తుత రోజుల్లో బ్యూటీ రంగానికి మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. మహిళలు ఇంటి వద్దే ఉంటూ సొంతంగా బ్యూటీ పార్లర్‌ నిర్వహించుకుంటూ మంచి ఆదాయాన్ని గడించవచ్చు. శిక్షణకు హాజరైన మహిళలకు కేవలం థియరీ మాత్రమే కాకుండా స్వయంగా వారే మేకప్‌, హెయిర్‌ స్టైల్స్‌ వేసేలా ప్రాక్టికల్‌ విధానంలో శిక్షణ ఇచ్చాం. మహిళలు ఈ శిక్షణ ద్వారా నేర్చుకున్న నైపుణ్యాలను ఉపయోగించుకుని భవిష్యత్తులో స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా స్థిరపడాలి.

– సావిత్రి, బ్యూటీపార్లర్‌ నిర్వాహకురాలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement