నడిగూడెం : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయిల్‌పామ్ సాగు క్రమేణా పెరుగుతోంది. రెండు నుంచి మూడేళ్ల లోపు ఆయిల్‌పామ్ తోటలకు కొమ్ము పురుగు వ్యాపించి రైతులకు నష్టం మిగిల్చే అవకాశం ఉందని కోదాడ ఉద్యానవనశాఖ అధికారి పూసపాటి అనిత చెబుతున్నారు. కొమ్ము పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆమె మాటల్లోనే..
ఈ కొమ్ము పురుగు (రైనోసిస్ బీటిల్) 30–50 మి.మీ. పొడవుతో ముదురు గోధుమ నుంచి నలుపు రంగులో ఉంటుంది. పురుగు 100 నుంచి 150 వరకు తెలుపు గుడ్లను 5–10 సెం.మీ. లోతులో పశువుల పెండ కుప్పలో లేదా చనిపోయిన చెట్ల మొదళ్లలో సముదాయాలుగా పెరుగుతుంది. ఈ గుడ్లు 2–3 వారాల్లో పొదుగుతాయి. పూర్తిగా ఎదిగిన లార్వాలు 30 సెం.మీ. లోతులో ఉండ కోశస్థ దశలుగా వృద్ధి చెంది 3–4 వారాల తర్వాత రెక్కల పురుగు(బీటిల్స్)గా మారుతాయి. తల్లి రెక్కల పురుగు 200 రోజులు బతికి ఉంటూ సంవత్సరానికి ఒకేసారి జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటాయి. ఈ బీటిల్స్ ఎక్కువగా మొక్క మొదలు దగ్గర అప్పుడే ఏర్పడుతున్న మొవ్వు, ఆకులను ఆశించి నష్టపరుస్తాయి. ఆకుల చివరన యు ఆకారపు ఖాళీలు ఏర్పరుస్తాయి. మొవ్వు భాగం గాని ఆకులను కురసగా మెలికలు తిరిగినట్టుగా అవుతాయి. లేత మొవ్వ భాగంలో ఆశించి లోపలికి చొచ్చుకొపోయి రంధ్రాలు చేసి మొవ్వు కుళ్లిపోయేటట్లు చేయడం వల్ల మొక్కలు చనిపోతాయి.
నివారణ చర్యలు :
u తోటల్లో చనిపోయిన ఆయిల్‌పామ్ చెట్లను తొలగించాలి. ఆయిల్‌పామ్ తోటల్లో కలుపు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తోటల్లో పశువుల పేడ(ఎరువు) నిల్వ ఉంచకూడదు.
u పశువుల ఎరువు టన్నుకు కిలో కార్బోప్యూరాన్ 3 శాతం గుళికలు లేదా 2 కిలోల మలాథియాన్ పొడిని కలుపుకొని మొదలు దగ్గర చల్లాలి.
u మొవ్వులో రంధ్రాలు గుర్తించిన వెంటనే కిలో మట్టికి 30 గ్రాముల మ్యాంకోజెబ్, 100 గ్రాముల క్లోరోఫైరిఫాస్ పొడి మందును కలిపి రంద్రాలు పూడ్చాలి.
u సోలార్ దీపపు ఎరలను ఏర్పాటు చేసుకోవాలి.
u థైనోల్యూర్ కలిగిన లింగాకర్షక బుట్టలు (బకెట్ ఫిర్మోన్ ట్రాప్స్) ఎకరానికి 1–2 ట్రాప్స్ ఏర్పాటు చేసుకోవాలి.
u బీటిల్స్ ఎక్కువగా ఆకిర్షించడానికి చెరకు రసం, ఫైన్ యాపిల్ రసం, ఈస్టును బాగా పులియబెట్టి ఎకరం తోటలో 5–6 చోట్ల అమర్చుకోవాలి.
u మెటారైజియం అనైసోప్లియా అనే జీవ సంబంధిత శిలీంధ్రనాశిని 5 గ్రాములు లీటరు నీటికి కలిపి మొవ్వు తడిచేలా పిచికారీ చేసుకుంటే ఫలితం ఉంటుంది.
u పురుగు నివారణకు తొలి దశలో వేప మందు 10,000 పీపీఎం 1 మి.లీ. ల్యామ్డా సైహాలోత్రిన్, 1 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
u పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే క్లోరాంట్రిన్‌ప్రోల్ 0.3 మి.లీ. లేదా స్పైనోశాడ్ 0.3 మి.లీ. లేదా టెట్రాటింనిప్రోల్ 1 మి.లీ. నీటిలో కలిపి మొక్క సుడిలో పోసుకోవాలి.
u లేత తోటల్లో 10–20 గ్రాములు 3జీ కార్బోప్యూరాన్ గుళికలు లేదా 10 గ్రాముల క్లొరాంట్రిన్‌ఫోల్ గుళికలు గుళికలు కవర్లలో ఉంచి ఒక చెట్టుకు 4 కవర్లు మొవ్వు భాగంలో కడితే పురుగును నివారించవచ్చు.


