ఆత్మకూరు(ఎం) : వివాహేతర సంబంధం కారణంగా ఉరేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకోగా.. ఆమె మృతదేహాన్ని గ్రామస్తులు ప్రియుడి ఇంటి ముందు ఉంచి ఆందోళన చేపట్టారు. ఈ ఘటన ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో గురువారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన శిగ లక్ష్మణ్, స్వరూప(36) దంపతులు జనరల్ స్టోర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్వరూప అదే గ్రామానికి చెందిన నాగం మల్లారెడ్డితో మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో పదిహేను రోజుల క్రితం మల్లారెడ్డి, స్వరూప కలిసి ఊరు నుంచి వెళ్లిపోయారు. దీంతో స్వరూప కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మల్లారెడ్డి తిరిగి స్వరూపను తీసుకొచ్చిఆమె కుటుంబ సభ్యులకు అప్పగించాడు. ఆ తర్వాత మళ్లీ మల్లారెడ్డి, స్వరూప కలిసి హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే ఉంటుండగా.. ఈ నెల 18న స్వరూప కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు వెళ్లి ఆమెకు నచ్చజెప్పి గుండాల మండలం అంబాల గ్రామంలో ఉంటున్న వారి బంధువుల ఇంటికి తీసుకొచ్చారు. అదే రోజు రాత్రి స్వరూప భర్త లక్ష్మణ్ అంబాల గ్రామానికి వెళ్లి భార్యతో మాట్లాడి తిరిగి ఆత్మకూరు(ఎం)కు వచ్చాడు. మరుసటిరోజు తెల్లవారుజామున స్వరూపను తీసుకురావడానికి లక్ష్మణ్ మరోసారి అంబాల గ్రామానికి వెళ్లగా.. స్వరూప ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం ఆమెను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈ నెల 23న మృతి చెందింది. గురువారం పోస్టుమార్టం అనంతరం అంబులెన్స్‌లో స్వరూప మృతదేహాన్ని ఆత్మకూరు(ఎం)కు తీసుకొచ్చారు.
అంబులెన్స్‌ను అడ్డుకున్న గ్రామస్తులు..
స్వరూప కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు నాగం మల్లారెడ్డి ఇంటి ముందు ఆమె మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేసేందుకు యత్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు స్వరూప మృతదేహాన్ని తీసుకొస్తున్న అంబులెన్స్‌ను ఆత్మకూరు(ఎం)కు కిలోమీటరు దూరంలో నిలిపివేశారు. దీంతో గ్రామస్తులు అంబులెన్స్‌కు అడ్డుగా నిలబడి నాగం మల్లారెడ్డిని ఎక్కడున్నా పట్టుకొని రావాలంటూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో గ్రామస్తులు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకున్నాయి. అనంతరం నాగం మల్లారెడ్డి ఇంటి మందు మృతదేహాన్ని ఉంచి సుమారు మూడు గంటల పాటు ఆందోళన నిర్వహించారు. చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
వివాహేతర సంబంధం కారణంగా ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
ప్రియుడి ఇంటి ముందు
మృతదేహం ఉంచి గ్రామస్తుల ధర్నా


