స్వర్ణగిరీశుడికి నవకలశ పంచామృతాభిషేకం | - | Sakshi
Sakshi News home page

స్వర్ణగిరీశుడికి నవకలశ పంచామృతాభిషేకం

Jun 26 2026 7:39 AM | Updated on Jun 26 2026 7:39 AM

భువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో వేంకటేశ్వరస్వామి దేవాలయంలో గురువారం ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి నవకలశ పంచామృతాభిషేకం నిర్వహించారు. అంతకుముందు ఉదయం ఆలయంలో సుప్రభాతసేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, తిరుప్పావడ సేవ, నిత్య కల్యాణోత్సవం, సాయంత్రం తిరువీది ఉత్సవ సేవ నిర్వహించారు. ఆయా పూజా కార్యక్రమాల్లో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

నీటి విడుదలతో

నిలిచిన లైనింగ్‌ పనులు

నిడమనూరు : తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయడంతో లైనింగ్‌ పనులు నిలిచిపోయాయి. కాల్వ 38వ కిలోమీటరు వద్ద (బొక్కముంతలపహాడ్‌–ముకుందాపురం), ముదిమాణిక్యం, నారేళ్ల మేజర్ల వద్ద నెల రోజులుగా జరుగుతున్న లైనింగ్‌ పనుల్లో ఆధునిక యంత్రాలు వాడకపోవడంతో నత్తనడకన పనులు సాగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ముకుందాపురం వద్ద కిలోమీటరుకు పైగా లైనింగ్‌ చేయాల్సి ఉండగా.. నెల రోజుల్లో కేవలం 200 మీటర్ల పనే జరిగింది. అజాక్స్‌ మిషన్‌తో సిమెంటు, ఇసుక, కంకర కలపడమే తప్ప పనుల్లో వేగం లేక తీవ్ర జాప్యం జరుగుతోంది. వారం తర్వాత నీటి విడుదల ఆపితే తిరిగి మరమ్మతులు మొదలయ్యే అవకాశం ఉంది. ఆధునిక యంత్రాలు ఉపయోగించి వానకాలం సాగునీటి విడుదల నాటికి నాణ్యతగా, సకాలంలో పనులు పూర్తయ్యేలా ఎన్‌ఎస్‌పీ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

విద్యుదాఘాతంతో ఆవు మృతి

మోత్కూరు : మండలంలోని దత్తప్పగూడెం గ్రామానికి చెందిన రైతు ఎలుగు కోటిలింగానికి చెందిన ఆవు విద్యుదాఘాతంతో గురువారం మృతి చెందింది. వివరాలు.. పాలడుగు శివారులో గల విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఆవు మేత మేస్తుండగా ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద కిందకు వేలాడుతున్న విద్యుత్‌ తీగలు తగిలి ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన ఆవుకు ప్రభుత్వం, విద్యుత్‌ శాఖ అధికారులు తగిన నష్ట పరిహారం అందించాలని బాధిత రైతు కోరుతున్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement