పెళ్లి ఇంట్లో చోరీ | - | Sakshi
Sakshi News home page

పెళ్లి ఇంట్లో చోరీ

Jun 26 2026 7:39 AM | Updated on Jun 26 2026 7:39 AM

బంగారు ఆభరణాలు,

నగదు అపహరణ

చిట్యాల : పెళ్లి ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో గురువారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకాపర్తి గ్రామానికి చెందిన శిరస్సు ముత్యాలు కుమార్తె వివాహం గురువారం రామన్నపేటలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరగగా.. కుటుంబ సభ్యులతో పాటు బంధువుల ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌హాల్‌కు వెళ్లారు. పెళ్లి అనంతరం సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంట్లో దాచి ఉంచిన రెండు తులాల బంగారు ఆభరణాలు, రూ.5లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో ముత్యాలు చిట్యాల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు విచారణ చేపట్టారు.

బైక్‌ను ఢీకొట్టిన లారీ.. యువకుడి దుర్మరణం

మృతుడు నల్లగొండ జిల్లా వాసి

భిక్కనూరు : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్ర సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన అఖిల్‌ (20) తన స్నేహితుడైన ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన ఓంకార్‌తో కలిసి ఆదిలాబాద్‌కు బైక్‌పై వెళ్తున్నారు. భిక్కనూరు పట్టణ శివారులోకి రాగానే వెనుక నుంచి వచ్చిన లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో అఖిల్‌ మృతిచెందాడని ఎస్‌ఐ తెలిపారు. ఓంకార్‌ పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.

డీసీఎం బీభత్సం

మద్యం మత్తులో లారీ, కారు,

మహిళను ఢీకొట్టిన డ్రైవర్‌

పట్టుకున్న పోలీసులు

గరిడేపల్లి : మండల కేంద్రంలో గురువారం డీసీఎం బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్తున్న డీసీఎం గరిడేపల్లి మండల కేంద్రంలో అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న బొగ్గు లారీని ఢీకొట్టింది. డీసీఎం డ్రైవర్‌ మద్యం మత్తులో ఉండటంతో అదే వేగంతో పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఓ కారును వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో డీసీఎం ధ్వంసమైంది. అయినప్పటికీ ఆపకుండా పారిపోతుండగా.. గరిడేపల్లిలోని తుమ్మాయిగడ్డ వద్ద రమణమ్మ అనే మహిళకు డీసీఎం తగిలి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు నేరేడుచర్ల ఎస్‌ఐ సైదిరెడ్డికి సమాచారం అందించారు. ఎస్‌ఐ వెంటనే పోలీస్‌ సిబ్బంది సహాయంతో నేరేడుచర్ల పట్టణ శివారులో బారికేడ్లు అడ్డుట్టి డీసీఎంను నిలువరించారు. డీసీఎంను గరిడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement