● 70 మంది ప్రయాణికులు సురక్షితం
రామగిరి
(నల్లగొండ) : బైక్‌ను తప్పించబోయిన ఆర్టీసీ బస్సు కల్వ ర్టు పైకి దూసుకెళ్లింది. ఈ ఘటన గురువారం నల్లగొండ మండల పరిధిలోని గొల్లగూడెం–మోటుబాయిగూడెం గ్రామాల మధ్య జరిగింది. వివరాలు.. నల్లగొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సుమారు 70 మందికి పైగా ప్రయాణికులతో చౌటుప్పల్ నుంచి నల్లగొండకు వస్తుంది. నల్లగొండ మండలంలోని గొల్లగూడెం–మోటుబాయిగూడెం మధ్య గల కల్వర్టు వద్దకు బస్సు చేరుకోగానే ఎదురుగా బైక్ వేగంగా వచ్చింది. బైక్‌ను ఢీకొట్టకుండా తప్పించే క్రమంలో డ్రైవర్ బస్సును పక్కకు తిప్పాడు. దీంతో బస్సు నియంత్రణ కోల్పోయి నేరుగా పక్కనే ఉన్న కల్వర్టు పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బస్సుకు గాని అందులోని ప్రయాణికులకు గాని ఎలాంటి ప్రమాదం జరగలేదని నల్లగొండ డిపో మేనేజర్ వెంకటరమణ తెలిపారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.


