సాక్షి, యాదాద్రి : ప్రజలకు మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో బీబీనగర్ ఎయిమ్స్ ప్రతినిధులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, బీబీనగర్ ఎయిమ్స్ బీబీనగర్ మధ్య రెఫరల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ఎయిమ్స్ కు రెఫర్ చేయబడే రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక లైజన్ అధికారిని నియమించాలని ఆదేశించారు. అదేవిధంగా ఎయిమ్స్ తరఫున జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో కూడా ఒక లైజన్ అధికారి అందుబాటులో ఉండి, రోగులకు తగిన సమన్వయం, వైద్య సహాయం అందించేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రజలు తమ మొబైల్ ప్లే స్టోర్ నుంచి స్వస్త్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని, ఎయిమ్స్ ఆసుపత్రికి 500 మీటర్ల పరిధిలోకి రాగానే ఈ యాప్ ద్వారా ఓపీ టోకెన్ ను ముందుగానే బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ కొండల్ రెడ్డి, డీసీహెచ్‌ఎస్ సూర్యశ్రీ రావు, ఎయిమ్స్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి


