మోత్కూరు : మోత్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నాటికి విద్యార్థుల నూతన ప్రవేశాలు 105కు చేరాయి. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు అరవిందరాయుడు మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధ్యాయుల కృషి ఫలితంగా పదో తరగతిలో వంద శాతం ఉత్తమ ఫలితాలు సాధించామన్నారు. దీంతో తల్లిదండ్రుల్లో పాఠశాల పట్ల నమ్మకం పెరిగిందని చెప్పారు. భవిష్యత్తులో పాఠశాలలో అడ్మిషన్ల సంఖ్య ఇంకా పెంచడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ కారుపోతుల వెంకన్న, ఉపాధ్యాయులు రాంప్రసాద్, రామకృష్ణ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం వేకువ జామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలం కారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యా లను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించాలి
భువనగిరి: మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించేందుకు కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్ సూచించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో సంకల్ప్ కన్వర్జెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముందస్తుగా గర్భిణులను గుర్తించి వారికి సమవర్థంగా సేవలు అందించాలన్నారు. క్యాన్సర్‌రోగులకు సంబంధించిన వివరాలను పోర్టల్‌లో సకాలంలో నమోదు చేయాలని సూచించారు. మాతా శిశు సంరక్షణ కోసం వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో డీసీహెచ్‌ఎస్ సూర్యశ్రీరావు, అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీదేవి, ఎస్‌ఎన్‌సీయూ ఇన్‌చార్జి కరుణాకర్ పాల్గొన్నారు.


