భువనగిరి: ఉపాధ్యాయుల సర్దుబాటుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా స్కూళ్లలో ఏ సబ్జెక్టులకు సంబంధించిన పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. ఎక్కడైనా ఉపాధ్యాయులు రిటైర్‌మెంట్ అయి, లాంగ్‌లీవ్‌లో వెళ్లగా ఏర్పడిన ఖాళీలు ఎన్ని ఉన్నాయో అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నెల 20వ తేదీ నాటికి నమోదైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలల వారీగా సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల అవసరాలను గుర్తిస్తున్నారు. ఈ లెక్కలు తేలిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన మిగులు ఉపాధ్యాయుల పోస్టుల సర్దుబాటు ఉత్తర్వులు 2024 అనుసరించి ఈ ప్రక్రియను కొనసాగిస్తారు.
జిల్లాలో715 ప్రభుత్వ పాఠశాలలు
జిల్లాలో ప్రస్తుతం 715 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 2,457 మంది ఉపాధ్యాయులుండగా వీరిలో ఉన్నత పాఠశాలల్లో 1412 మంది, ప్రాథమిక పాఠశాలల్లో 1,045 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.
డిప్యుటేషన్‌పై వెళ్లిన చోట అవసరముంటే..
డిప్యుటేషన్‌పై వెళ్లినచోట సదరు సబ్జెక్ట్ ఉపాధ్యాయుని అవసరం ఇంకా ఉంటే అతను అక్కడే కొనసాగాల్సి ఉంటుంది. కాగా సర్దుబాటు ప్రక్రియ ముందుగా జెడ్పీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, అనంతరం ప్రాథమిక పాఠశాలల్లో చేయనున్నారు. జీఓ నంబర్ 25లోని మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రక్రియ చేపట్టనున్నారు.
రిలీవింగ్ పై ఆంక్షలు
విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలల వారీగా సబ్జెక్టుల వారీగా అవసరాలను గుర్తించి జిల్లా పరిధిలోని మిగులు ఉపాధ్యాయులను అవసమున్న పాఠశాలల్లో సర్దుబాటు చేయడానికి గతంలో కలెక్టర్‌కు అధికార ఉత్తర్వులు ఇచ్చారు. దీనిప్రకారం 2025–26 విద్యా సంవత్సరంలో ఈ సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేశారు. అలాగే వర్క్ అడ్జెస్ట్‌మెంట్ ప్రాతిపదికన మిగులు పాఠశాలల నుంచి అవసరమున్న పాఠశాలలకు పంపించిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయవద్దని 2026 ఏప్రిల్ 22న స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విషయమై తగిన సూచనలు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులను సైతం ఆదేశాలు ఇచ్చారు.
వివరాలు సేకరిస్తున్నాం – డీఈఓ
జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియకు సంబంధించి ఖాళీలు వివరాలు సేకరిస్తున్నట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత పాఠశాలల్లో ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తామని చెప్పారు.
ఫ సబ్జెక్టుల వారీగా ఖాళీ పోస్టులపై అధికారుల ఆరా
ఫ 20వతేదీ నాటికి ఉన్న విద్యార్థుల
సంఖ్య ఆధారంగానే టీచర్ల
కేటాయింపు


