మోత్కూరు : అకౌంట్లలో డబ్బులున్నా డ్రా చేసుకోలేని పరిస్థితి.. మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు చెందిన 254 దళిత కుటుంబాలది. రెండేళ్లుగా ఖాతాలు ఫ్రీజింగ్ అయి ఉన్నాయి. ఈ విషయంలో అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. గత ప్రభుత్వం 2023 నవంబర్‌లో దళితబంధు రెండో విడత కింద మోత్కూరు, అడ్డగూడూరు మండలాల నుంచి 254 మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. వివిధ రకాల వ్యాపారాలు, వాహనాల యూనిట్ల కోసం ఒక్కొక్కరి వ్యక్తిగత ఖాతాలో రూ.3 లక్షల చొప్పున మొత్తం రూ.7.62 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో కలెక్టర్ల ఆదేశాల మేరకు ఈ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఎన్నికలు ముగిసి, ప్రభుత్వం మారి రెండేళ్లు కావస్తున్నా నేటికీఫ్రీజింగ్‌ను ఎత్తివేయకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
స్పందించని యంత్రాంగం
దళితబంధు నిధులను మంజూరు చేయాలని గతేడాది జనవరి 28న రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఎండీ కలెక్టర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా స్థానిక యంత్రాంగంలో చలనం లేకపోవడం గమనార్హం. తమ సమస్యను పరిష్కరించాలని లబ్ధిదారులు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్‌కుమార్‌కు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగకు, స్థానిక తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌కు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేకుండా పోయింది. సంబంధిత అధికారులు, ప్రభుత్వం స్పందించి దళితబంధు నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.
ఫ రెండేళ్లుగా 254 మంది దళిత కుటుంబాల ఖాతాలు ఫ్రీజింగ్
ఫ మోత్కూరు, అడ్డగూడూరు మండలాల దళితబంధు లబ్ధిదారుల ఎదురుచూపు


