యాదగిరిగుట్ట: దేశంలో మతాలు, కులాలను అడ్డుపెట్టుకొని ప్రధాని మోదీ ఓట్లు, సీట్లు చోరీ చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆరోపించారు. యాదగిరిగుట్ట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం సర్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో రైతులు, యువత, విద్యార్థులు, ప్రజలను ప్రధాని మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పన్నెండు ఏళ్లుగా దేశ ప్రజలను మోసం చేస్తున్న ప్రధానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే విధంగా నీట్‌ను రద్దు చేసి రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. విద్యార్థులకు అండగా నిలవాల్సిన ప్రధానినీట్‌ను రద్దు చేసి వారి పాలిట శాపంగా మారారన్నారు. ఓట్లను రద్దు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. ఓటు హక్కుపై బూత్ లెవల్ ఎజెంట్లు అవగాహన కల్పించాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు, యువతి తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలన్నారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈ నెల 26న యాదగిరిగుట్ట పట్టణంలో యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, కాంగ్రెస్ అనుబంధ సంఘాలతో కలిసి 5వేల మందితో విద్యార్థులతో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఛాత్ర్‌కి గూంజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఈ అవగాహన సదస్సులో మున్సిపల్ చైర్‌పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్‌గౌడ్, డీసీసీ మాజీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, మండల, పట్టణ అధ్యక్షులు మంగ సత్యనారాయణ, ముక్కెర్ల మల్లేష్, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ రమ్య పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య


