త్రిపురారం : ఎల్‌నినో ప్రభావంతో వానాకాలం సీజన్‌లో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేస్తోంది. దీంతో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతులు సాంప్రదాయ పంటల సాగుకు పరిమితం కాకుండా పంట మార్పిడి వైపు అడుగులు వేయాలని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ప్రోగ్రాం కోఆర్డినేటర్ చంద్రశేఖర్ సూచిస్తున్నారు. వానాకాలం సీజన్‌లో పంటల సాగుపై ఆయన సలహాలు, సూచనలు ఇవీ..
వరిపై ఆధారపడటం తగ్గించుకోవాలి
అధిక నీరు అవసరమయ్యే వరి సాగును రైతులు తగ్గించడం ఉత్తమం. ఎకరా వరి సాగుకు కావల్సిన నీటితో రెండు నుంచి మూడు ఎకరాల పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగు చేపట్టవచ్చు. మినుములు, పెసర్లు, కందులు, నువ్వులు, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. తక్కువ నీరు, పెట్టుబడితో సాగు చేసే ఈ పంటల వల్ల నేలను పరిరక్షించుకోవచ్చు. వరి సాగు తగ్గించి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి గ్రామాల్లో రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
భూసార పరీక్షలు చేయించాలి
రైతులు పంట మార్పిడి చేపట్టడానికి ముందు భూసార పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం. వానాకాలం పంటల సాగుకు ముందు భూసార పరీక్షలు చేయించుకొని పంటలకు అవసరమైన మేరకు మాత్రమే ఎరువులను వేయాలి.
వరి సాగు తగ్గిస్తేనే రైతులకు
ప్రయోజనం
కంపాసాగర్ కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ చంద్రశేఖర్ సూచనలు
ఈ సీజన్‌లో అనుకూలమైన పంటలు ఇవే..
జిల్లాలో ఎర్ర నేలలు అధికంగా ఉన్నాయి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కంది, పెసర, మినుము, ఆముదం, సజ్జ, రాగి, జొన్న పంటలు సాగు చేయడం ఉత్తమం. అంతేకాకుండా బెండ, వంకాయ, టమాట, మిర్చి, దొండ,
కాకర వంటి కూరగాయ పంటలను సాగు చేయడం వలన ఆదాయం ఎక్కువగా వస్తుంది. ఉమ్మడి జిల్లాలో కొన్ని మండలాల్లో వర్షాధార భూములు ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో కూడా వరి సాగు కంటే పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు చేపట్టడం నీటి వినియోగం గణనీయంగా తగ్గుతుంది. అందుబాటులో ఉన్న బోర్లు, బావుల్లోని నీటిని వినియోగించుకుని డ్రిప్‌లు, స్ప్రింక్లర్లు ఉపయోగిస్తూ నీటిని పొదుపుగా వాడుకోవచ్చు.


