మదర్‌ డెయిరీని లాభాల బాట పట్టిస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

మదర్‌ డెయిరీని లాభాల బాట పట్టిస్తున్నాం

Jun 25 2026 5:59 AM | Updated on Jun 25 2026 5:59 AM

సాక్షి, యాదాద్రి : సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు(ఎన్‌డీడీబీ)తో ఒప్పందం చేసుకుని మదర్‌ డెయిరీని లాభాల బాట పట్టిస్తున్నామని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. బుధవారం భువనగిరిలోని మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మదర్‌ డెయిరీ చైర్మన్‌ గుడిపాటి మధుసూదన్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. గత బీఆర్‌ఎస్‌ పాలనలో రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల నష్టాల్లో కూరుకుపోయిన మదర్‌ డెయిరీని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రక్షాళన చేయడం ప్రారంభించిందన్నారు. మదర్‌ డెయిరీని ఎన్‌డీడీబీ టేకోవర్‌ చేసిన వెంటనే పెండింగ్‌లో ఉన్న రూ.10 కోట్ల బిల్లులను పాడి రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఇటీవల మరో రూ.3 కోట్లు విడుదల చేశారన్నారు. అంతేకాకుండా లీటరు పాల ధర రూ.3 వరకు పెంచిందన్నారు. ఏ పాల సెంటర్‌ నుంచి అయితే రోజుకు 1000 లీటర్ల పాలు సేకరిస్తారో ఆ సెంటర్‌కు అదనంగా లీటరుకు రూ.1 చొప్పున బోనస్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ఏ పాడి రైతు అయితే ప్రతి రోజు 100 లీటర్ల కన్నా ఎక్కువ పాలు పోస్తారో వారికి లీటరుకు అదనంగా రూ.1 చొప్పున బోనస్‌ను ఇచ్చే విధానం అమలు చేస్తున్నామన్నారు. పాడి రైతులు మదర్‌ డెయిరీని మాత్రమే నమ్మాలని కోరారు. మూతపడిన భువనగిరి ఫీడ్‌ మిక్సింగ్‌ కర్మాగారాన్ని పునరుద్ధరించి, రైతులకు సబ్సిడీపై దాణా అందించాలని నిర్ణయించామన్నారు.

రెండోసారి ధర పెంపు..

గేదె పాల(5 ఫ్యాట్‌) సేకరణ ధర గతంలో లీటరుకు రూ.40 ఉండేదని, ఎన్‌డీడీబీ మదర్‌ డెయిరీని టేకోవర్‌ చేసిన మొదటి నెలలోనే ఈ ధరను రూ.41.50 చేశారన్నారు. అంతేకాకుండా మంగళవారం నుంచి మరో రూపాయి పెంచడంతో ప్రస్తుతం లీటరు పాల సేకరణ ధర రూ.42.50కి చేరిందన్నారు. ఆవు పాల(3 ఫ్యాట్‌) సేకరణ ధర గతంలో లీటరుకు రూ.34.50 ఉండేదన్నారు. రెండుసార్లు ధర పెంచిన తర్వాత ప్రస్తుతం లీటరు పాల సేకరణ ధర రూ.36.46కి చేరిందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, మదర్‌ డెయిరీ డైరెక్టర్లు కస్తూరి పాండు, శ్రీశైలం, నరేందర్‌రెడ్డి, నర్సింహులు, రాంరెడ్డి, భాస్కర్‌గౌడ్‌, డెయిరీ సీఈఓ కాటిపల్లి లింగారెడ్డి, చైర్మన్లు వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

ఫ ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య

ఫ మరోసారి పాల సేకరణ ధర పెంపు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement