పెద్దవూర : కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దవూర మండలం ఊరబావితండా వద్ద బుధవారం జరిగింది. వివరాలు.. నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు ఊరబావితండా సమీపంలోని ఏఎమ్మార్పీ వరద కాలువ బ్రిడ్జి వద్దకు రాగానే అదుపుతప్పి కల్వర్టును ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం ధ్వంసమై టైరు ఊడిపోయింది. కారులో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు.
ఉపాధ్యాయురాలి ఆత్మహత్య
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ మండల పరిధిలోని జీ స్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకున్న విషయం బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన నందిత మోండాల్, ప్రోలై మోండాల్ దంపతులు 2020–21 విద్యా సంవత్సరం నుంచి నల్లగొండ మండల పరిధిలోని జీ స్కూల్‌లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి ఒక పాప ఉంది. ఆమె కూడా ఇదే పాఠశాలలో 4వ తరగతి చదువుతుంది. వీరు పాఠశాలలోని స్టాఫ్ క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు. ఈ నెల 22న మధ్యాహ్నం నందిత మోండాల్ భోజనం చేసేందుకు పాఠశాల నుంచి క్వార్టర్స్‌కి వెళ్లింది. చాలాసేపటి వరకు నందిత మోండాల్ తిరిగి రాకపోవడంతో భర్త ప్రోలై మోండాల్ వెళ్లి చూడగా ఆమె ఉరేసుకుని కనిపించింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు నల్లగొండ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వస్థలం పశ్చిమబెంగాల్‌కు తీసుకెళ్లారు.
చికిత్స పొందుతూ
మహిళ మృతి
గుండాల : కుటుంబ కలహాలతో ఉరేసుకున్న మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన సిగ స్వరూప(36) కుటుంబ కలహాల కారణంగా కొద్దిరోజుల క్రితం గుండాల మండలం అంబాల గ్రామంలో ఉంటున్న తన చిన్న మ్మ బీసు సత్తమ్మ ఇంటికి వచ్చింది. మనస్తాపానికి గురైన స్వరూప ఈ నెల 19న తన చిన్నమ్మ ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. మృతురాలి తండ్రి గునుగుండ్ల వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎం. శోభన్‌బాబు తెలిపారు. మృతురాలికి భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు.


