చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడిన నిందితుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడిన నిందితుల అరెస్టు

Jun 25 2026 5:59 AM | Updated on Jun 25 2026 5:59 AM

మిర్యాలగూడ అర్బన్‌ : మిర్యాలగూడ పట్టణంలోని సంతోష్‌నగర్‌లో ఈ నెల 17న చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడిన ఇద్దరు నిందితులను మిర్యాలగూడ టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సీఐ సోమనర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం గోపసముద్రం తండాకు చెందిన అజ్మీరా శశిధర్‌నాయక్‌, బంగారుగడ్డకు చెందిన ధనావత్‌ కార్తీక్‌ హైదరాబాద్‌లో ర్యాపిడో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. చెడు వ్యసనాలకు బానిసలైన వీరిద్దరు హైదరాబాద్‌లో పార్కింగ్‌ చేసిన స్కూటీని చోరీ చేశారు. ఈ నెల 17న తెల్ల వారుజామున మిర్యాలగూడ పట్టణంలోని అశోక్‌నగర్‌లో మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం మిర్యాలగూడ పట్టణంలోని ఫ్‌లైఓవర్‌ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించగా వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా చైన్‌స్నాచింగ్‌ చేసింది తామేనని ఒప్పుకున్నారు. చోరీ చేసిన బంగారు గొలుసును మిర్యాలగూడలోని మణప్పురం ఫైనాన్స్‌లో తనఖా పెట్టి రూ.1.22లక్షలు రుణం తీసుకుని జల్సాలకు ఖర్చు చేసినట్లు సీఐ తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి రెండు స్కూటీలు, రెండు సెల్‌ఫోన్లు, తనఖా పెట్టిన బంగారు గొలుసుకు సంబంధించిన రశీదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement