ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా..
చౌటుప్పల్ : చౌటుప్పల్‌లో అండర్‌పాస్ విస్తరణ పనులు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. కాంట్రాక్టర్ తన ఇష్టారాజ్యంగా ముందస్తు సమాచారం లేకుండా దారులను మూసేస్తుండటంతో ట్రాఫిక్ కష్టాలు తీవ్రరూపం దాల్చాయి. కిలోమీటర్ల మేర బారులు తీరుతున్న వాహనాలతో పట్టణం దాటాలంటేనే జనం జంకుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కరువై, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది.
జాతీయ రహదారిని మూసి..
చౌటుప్పల్‌లో అండర్‌పాస్ విస్తరణ పనులు రెండేళ్ల క్రితం ప్రారంభించారు. ముందుగా ఇరువైపులా సర్వీస్‌రోడ్ల వెంట డ్రెయినేజీలు నిర్మించారు. ఈ ఏడాది మార్చిలో బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలయ్యాయి. నవోదయ టాకీస్ వద్ద నుంచి ఎలిమినేటి మాధవరెడ్డి బీఈడీ కళాశాల వరకు 2.37కిలోమీటర్ల మేర బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. అందులో భాగంగా నవోదయ టాకీస్ ప్రాంతంలో పనులు ప్రారంభించారు. అక్కడి నుంచి తంగడపల్లి చౌరస్తా వరకు మొదలుపెట్టారు. కానీ పని మాత్రం బస్టాండ్ ఎదురుగానే ఎక్కువగా చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ ముందు, తంగడపల్లి చౌరస్తా సమీపంలో అప్పుడప్పుడు పనులు సాగుతున్నాయి. మంగళవారం చిన్నకొండూర్ రోడ్డు నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకు వరకు జాతీయ రహదారిని మూసేసి వాహనాలను సర్వీస్‌రోడ్డు మీదుగా మళ్లించారు. దాంతో ప్రజలు, వాహనదారులు నరకం చూస్తున్నారు.
దారి మళ్లింపుతో మరిన్ని కష్టాలు
అండర్‌పాస్ నిర్మాణం చేపట్టడంతో ముందుగా హైదరాబాద్ మార్గంలో తంగడపల్లి చౌరస్తా నుంచి పైలాన్‌పార్క్ వరకు, ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లే దారి నుంచి బస్టాండ్ వరకు వాహనాలను హైవే మీది నుంచి సర్వీస్‌రోడ్డు వైపునకు దారి మళ్లించారు. కొద్ది రోజుల తర్వాత బస్టాండ్ వద్ద వాహనాలను నిలిపివేసి సర్వీస్‌రోడ్డు మీదుగా చిన్నకొండూర్ వరకు మళ్లించారు. తాజాగా చిన్నకొండూర్ రోడ్డు నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకు వరకు హైవే రోడ్డును పూర్తిగా మూసేశారు. వాహనాలు హైవేపైకి రాకపోకలు సాగింగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో జేసీబీతో కాలువ(ట్రెంచ్) తవ్వారు. అయితే ఇప్పటి వరకు మూడు నెలలు దాటినప్పటికీ ప్రారంభించిన ప్రాంతంలో నామమాత్రంగానే పని జరగగా ఇప్పుడు అదనంగా మరో కిలోమీటరు దూరాన్ని మూసేయడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చిన్నకొండూర్ చౌరస్తా వద్ద హైవేపైకి వెళ్లకుండా అడ్డంగా కాలువ తవ్వించిన కాంట్రాక్టర్
విజయవాడ మార్గంలో సర్వీస్‌రోడ్డు మీదుగా బారులుదీరిన వాహనాలు
చౌటుప్పల్ పట్ణణంలో అండర్‌పాస్ విస్తరణ కష్టాలు
ఫ ఇష్టానుసారంగా రోడ్లు మూసేస్తున్న కాంట్రాక్టర్
ఫ ట్రాఫిక్ చక్ర బంధంలో ప్రజలు, వాహనదారులు
పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారిపై పనులు చేస్తూ సాధారణ రోడ్డు మాదిరిగా వ్యవహరిస్తూ స్థానిక ప్రజలు, వాహనదారులను ఇబ్బందులపాలు చేస్తున్నారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా రాత్రికిరాత్రి నిర్ణయాలు తీసుకొని ప్రజలను అవస్థలకు గురిచేస్తున్నారు. ఇదేమని ఎవరైనా గట్టిగా అడిగితే తాము అందరికీ సమాచారం ఇచ్చామంటున్నారు. ఎవరికి ఇచ్చారని నిలదీస్తే పోలీసు శాఖ పేరు చెప్పి తప్పించుకుంటున్నారు. చిన్నకొండూరు జంక్షన్ మూసివేసి తెలంగాణ గ్రామీణ బ్యాంకు వద్ద వాహనాలు హైవేపైకి వెళ్లేలా చేసిన కాంట్రాక్టర్, వలిగొండరోడ్డు నుంచి చౌటుప్పల్ పాత ఊర్లోకి ఏ రోడ్డు గుండా వెళ్లాలో ప్రత్యామ్నాయ మార్గాలను చూపించలేదు. కొంత మంది తప్పనిసరి పరిస్థితుల్లో విజయవాడ మార్గంలో ప్రమాదకరంగా ఎదురుగానే వెళ్తున్నారు. ఇప్పటికై నా వివిధ శాఖల అధికారులు చొరవ తీసుకొని ట్రాఫిక్ కష్టాలను తీర్చాలని పలువురు కోరుతున్నారు.


