ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల బాదుడు
అమలుకాని చట్టం
ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం సిద్ధం చేసిన కొత్త ముసాయిదా చట్టంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. కానీ, క్షేత్రస్థాయిలో ఇవి ఎక్కడా అమలు కావడం లేదు. నిబంధనల ప్రకారం.. పాఠశాలల ప్రాంగణాల్లో యూనిఫాం, పుస్తకాలు, బెల్టులు, టైలు విక్రయించకూడదు. కానీ ప్రైవేట్ స్కూళ్లు క్యాంపస్‌లోనే సొంతంగా కౌంటర్లు ఏర్పాటు చేసి.. లేదా తాము చెప్పిన ప్రైవేట్ దుకాణాల్లోనే కొనాలని నిబంధనలు పెట్టి మార్కెట్ రేటు కంటే రెట్టింపు ధరకు అమ్ముతున్నాయి. అలాగే, ఇష్టం వచ్చినట్లు ఫీజులు పెంచుతున్నాయి. ఈ ముసాయిదా నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ఉండాలంటే.. జిల్లా విద్యాశాఖ తక్షణమే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలి. విద్యా సంవత్సరం (జూన్) ప్రారంభం నుంచే ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచే ప్రైవేట్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటేనే సామాన్య విద్యార్థులకు న్యాయం జరుగుతుంది.
ఫ డిజిటల్ క్లాసులు, ఏఐ బోధన పేరిట ఏటా 10 నుంచి 30 శాతం పెంపు
ఫ కొరవడిన విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ
ఫ యాజమాన్యాల ఇష్టారాజ్యం
సాక్షి యాదాద్రి: ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీ అడ్డూఅదుపూ లేకుండా సాగుతోంది. ఎల్‌కేజీకే రూ.30 వేలకు పైగా వసూలు చేయడంతో పాటు.. పుస్తకాలు, యూనిఫాం తాము చెప్పిన దుకా ణాల్లోనే కొనాలంటూ హుకుం జారీ చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలు కాగితాలకే పరిమితం కావడం, అధికారుల పర్యవేక్షణ కరువవడంతో జిల్లాలో విద్యా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతోంది.
జిల్లాలో 56,066 మంది విద్యార్థులు
జిల్లాలో 160 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. అందులో 56,066 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ప్రైవేట్ ఎయిడెడ్–3, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ 152, సీబీఎస్‌ఈ 5 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో బాలురు 31,071, బాలికలు 24,995 మంది చదువుకుంటున్నారు.భువనగిరి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, ఆలేరు, పోచంపల్లి, మోత్కూరు, బీబీనగర్, వంటి ప్రధాన కేంద్రాల్లోని ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎల్‌కేజీ, యూకేజీ అడ్మిషన్లకు అక్షరాలా రూ.30వేలకు పైగా ఫీజులు వసూలు చేస్తున్నారు. నాణ్యమైన చదువు, డిజిటల్ క్లాసులు, ఏఐ విద్యాబోధన పేర్లతో ఏటా 10 నుంచి 30 శాతం ఫీజులు పెంచుతూ యాజమాన్యాలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి.
వ్యాపారం ఇలా..
ప్రైవేట్‌పాఠశాలలు తెలివిగా వ్యవహరిస్తున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభంతోనే పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, వర్క్ బుక్‌లను తాము సూచించిన చోటనే కొనుగోలు చేయాలన్న నిబంధన పెట్టాయి. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఒక్కో ప్రైవేట్ పాఠశాల ఒక్కో బుక్‌స్టోర్‌ను ఎంపిక చేసుకున్నాయి. అక్కడే కొనుగోలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించాయి. అక్కడికి వెళ్లిన తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నారు. ఏఐ బేసిక్స్, ఐఐటీ కోచింగ్, ఫౌండేషన్, ఒలింపియాడ్, వర్క్‌షీట్లు, నోట్‌బుక్స్, అసైన్‌మెంట్ బుక్స్, యాక్టివిటీ బుక్స్, వర్క్‌బుక్స్ ఇలా పలురకాలుగా అంటగట్టి డబ్బులు దండుకుంటున్నారు. కొన్ని పాఠశాలల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మెటీరియల్ అమ్ముతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
సోషల్‌మీడియాలో వైరల్ అయిన 4వతరగతి స్కూల్ ఫీజుల పట్టిక
ట్యూషన్ ఫీజు రూ.34,000
పుస్తకాలు రూ.6,500
స్కూల్ బస్సు ఫీజు రూ.10,000
అడ్మిషన్ ఫీజు రూ. 3,000
యూనిఫాం (జతకు):రూ.1,500


