ఆత్మకూరు(ఎం): రపతి విద్యార్థినిపై పర్యవేక్షణ ఉంచి, నాణ్యతమైన విద్యను అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. మంగళవారం ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాలలో పరిసరాలు, స్టోర్ రూమ్‌లు, కిచెన్ గదిని, వంటను పరిశీలించారు. విద్యార్థినుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. మోనూ ప్రకారం వంటచేయాలని సూచించారు. స్థానిక ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్మాణంలో ఉన్న భవిత కేంద్రాన్ని, అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలు, బాలింతలు, గర్భిణులకు అందిస్తున్న పోషకారం పరిశీలించారు. ఆయన వెంట డీఈఓ బి. భిక్షపతి, తహసీల్దార్ వి. లావణ్య, ఎంఈఓ కొత్త మహదేవరెడ్డి, ఎస్‌ఓ ఎం. పద్మ ఉన్నారు.
గుట్ట దేవస్థానం ఉద్యోగుల తాత్కాలిక సంఘం ఏర్పాటు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉద్యోగుల తాత్కాలిక సంఘాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా ఏఈఓ జి.రఘు, ప్రధాన కార్యదర్శిగా సూపరింటెండెంట్ వి.వెంకటప్రసాద్, కోశాధికారిగా డి.నరేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉప ప్రధానార్చకుడు శ్రీధర్ శర్మ, కార్యవర్గ సభ్యులుగా ఉప ప్రధానార్చకుడు మాధవాచార్యులు, సీనియర్ అసిస్టెంట్లు రత్న దీప, ఎన్.నగేష్, రికార్డు అసిస్టెంట్ డి.శ్రవణ్‌కుమార్, ఎం.రాం తిరుపాలు, బండ సత్యనారాయణ, బి.పాండు, యాదగిరి, నాగులు తదితరులను నియమించారు. అనంతరం రఘు, వెంకటప్రసాద్‌లు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. త్వరలోనే సాధారణ సమావేశం ఏర్పాటు చేసి, శాశ్వత కార్యవర్గాన్ని ఎన్నుకుంటామన్నారు.
యాదగిరీశుడి క్షేత్రంలో విశేష పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం విశేష పూజలు కొనసాగాయి. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఆకుపూజను అర్చకులు విశేషంగా నిర్వహించారు. వేకువజామునే ప్రధానాలయాన్ని తెరచిన అర్చకులు సంప్రదాయ పద్ధతిలో సుప్రభాతం చేపట్టారు. అనంతరం బిందెతీర్థం, బాలభోగం, హారతి నివేదన వంటి పూజలు చేశారు. స్వయంభూలకు పంచామృతాలతో అభిషేకం, తులసీ దళాలతో అర్చన జరిపారు. ఇక క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో విష్ణు పుష్కరిణి వద్ద హనుమాన్ ఆలయంలో తమలపాకులతో పూజలు నిర్వహించారు. సింధూరంతో అభిషేకించిన శ్రీఆంజనేయస్వామిని తమలపాకులతో అర్చన చేశారు. ఇక శ్రీస్వామి వారి ప్రధానాలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలను భక్తుల మధ్యన నిర్వహించారు.
అంగన్‌వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర
భువనగిరిటౌన్ : అంగన్‌వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు దాసరి పాండు ఆరోపించారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాండు మాట్లాడుతూ నూతనంగా తీసుకొస్తున్న ప్రీ–ప్రైమరీ స్కూళ్ల బాధ్యతలను అంగన్‌వాడీ కేంద్రాలకే అప్పగించాలన్నారు. ప్రీ–ప్రైమరీ స్కూళ్లలో టీచర్లు, ఆయాలను నియమించడం వల్ల ప్రస్తుతం పనిచేస్తున్న వారి ఉపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు మాయకృష్ణ, తెలంగాణ అంగన్‌న్‌వాడీ టీచర్స్,హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పాల్గొన్నారు.


