యూసీఎఫ్ కోసం ప్రతిపాదనలు పంపాం
ఆలేరు: ఆలేరు పట్టణంలో జాతీయ రహదారి పక్కన ఉన్న విలువైన మున్సిపల్ స్థలం ఏళ్లుగా ఖాళీగా ఉండటంతో ఆక్రమణల ముప్పు పొంచి ఉంది. ఇక్కడ ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలన్న మున్సిపల్ పాలకవర్గం ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. కాంప్లెక్స్ నిర్మిస్తే అటు మున్సిపాలిటీకి లక్షల్లో ఆదాయంతో పాటు, ఇటు స్థానిక యువతకు ఉపాధి లభించే అవకాశం ఉన్నా.. బీఓటీ విధానానికి స్పందన కరువవడం, అధికారుల జాప్యంతో ఆ విలువైన స్థలం నిరుపయోగంగా మారింది.
కొత్త నిర్మాణాలు చేపట్టక..
ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో హైదరాబాద్–వరంగల్ హైవే పక్కన రైల్వేస్టేషన్ ఎదురుగా మున్సిపాలిటీకి చెందిన సుమారు 600 చదరపు గజాల విలువైన స్థలం ఉంది. మున్సిపాలిటీ ఏర్పడక ముందు నుంచే ఈ స్థలంలో ఆరు వాణిజ్య మడిగెలు ఉండేవి. వాటిని అద్దెకు ఇచ్చి గ్రామపంచాయతీ, అనంతరం మున్సిపాలిటీ ఆదాయాన్ని పొందాయి. అయితే కాలక్రమేణా శిథిలావస్థకు చేరిన ఆ మడిగెలను గత పాలకమండలి హయాంలో కూల్చివేసినప్పటికీ, వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టలేదు. ఫలితంగా అద్దె రూపంలో వచ్చే ఆదాయానికి బ్రేక్ పడింది.
కౌన్సిల్‌లో తీర్మానం
చైర్‌పర్సన్‌గా బీజన బాలమణి నేతృత్వంలోని ప్రస్తుత పాలకవర్గం బిల్డ్–ఆపరేట్–ట్రాన్స్‌ఫర్(బీఓటీ) విధానంలో షాపింగ్ కంప్లెక్స్(మడిగెలు) నిర్మించాలని నిర్ణయించింది. ఈమేరకు ఈ ఏడాది మార్చిలో జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో తీర్మానం కూడా చేసింది. అయితే మూడు నెలలు గడిచినా కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి పురోగతి కనిపించడంలేదు.
ఆక్రమణల భయం..
పట్టణంలో ప్రధాన ప్రాంతంలోని మున్సిపల్ స్థలం చుట్టూ వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.2కోట్ల వరకు ఉంటుందని స్థానికుల అంచనా. ఇలాంటి విలువైన స్థలాన్ని ఏళ్ల తరబడి ఖాళీగా వదిలేయడం వల్ల భవిష్యత్తులో ఆక్రమణల ముప్పు పొంచి ఉందనే భయాందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది.
మున్సిపల్ నిధుల నుంచి..
రూ.15కోట్ల టీయూఎఫ్‌డీసీ ,మరో రూ.15కోట్ల నగరాభివృద్ధి నిధులతోపాటు అదనంగా జనరల్ ఫండ్ కూడా మున్సిపల్ ఖజానాలో ఉంది. బీఓటీ విధానంలో ఎవరూ ముందుకు రాకపోతే మున్సిపాలిటీలోని నిధుల్లోంచి కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టే అంశాన్ని పాలకమండలి ,అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది.
ఫ ఆలేరులో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం
ఫ మూడునెలలైనా బీఓటీ విధానానికి స్పందన కరువు
ఫ రూ.2కోట్ల విలువైన స్థలానికి ఆక్రమణల ముప్పు
షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలనే యోచనతో గత కౌన్సిల్‌లో పాలకమండలి తీర్మానం చేసింది. బీఓటీ విధానంలో నిర్మించాలని భావించినప్పటికీ ఆశించిన స్పందన రావడం లేదు. దాంతో అర్బన్ చాలెంజింగ్ ఫండ్(యూసీఎఫ్) కింద మున్సిపాలిటీనే నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వానికి ఇటీవల ప్రతి పాదన చేశాం.ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే తదుపరి చర్యలు తీసుకుంటాం. మున్సిపల్ స్థలం ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటాం.
–శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్,ఆలేరు


