ఫ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీవాణి రవికుమార్
భువనగిరి టౌన్ : తడి చెత్త నుంచి ఎరువును తయారు చేసేలా క్షేత్రస్థాయి సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి అవగాహన కల్పించాలని భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ సూచించారు. మంగళవారం భువనగిరి పట్టణంలోని మున్సిపల్ రిసోర్స్ పార్క్ (డంపింగ్ యార్డ్)లో ఆన్‌సైట్ కంపోస్టింగ్‌పై నిర్వహించిన శిక్షణకు ఆమె హాజరయ్యారు. భువనగిరి మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కంపోస్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ హేమలత పాల్గొని క్షేత్రస్థాయి బృందాలకు సాంకేతిక మార్గదర్శకత్వం చేశారు. చైర్‌పర్సన్ శ్రీవాణి మాట్లాడుతూ ఆన్‌సైట్ కంపోస్టింగ్ విధానాన్ని సమర్థంగా అమలు చేయడానికి ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ శిక్షణలో భువనగిరితో పాటు మోత్కూరు, చౌటుప్పల్, ఆలేరు, పోచంపల్లి, యాదగిరిగుట్ట, స్టేషన్ ఘన్‌పూర్, జనగామ మున్సిపాలిటీలతో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన కమిషనర్లు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.


