● హుండీలోని నగదు ఎత్తుకెళ్లిన
గుర్తుతెలియని వ్యక్తులు
దేవరకొండ : పట్టణంలోని మినీ బస్టాండ్ సమీపంలో గల విజయ వినాయకస్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయం గేటుకు వేసిన తాళం పగులగొట్టి హుండీలో భక్తులు సమర్పించిన కానుకలు దొంగిలించారు. సోమవారం ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు చోరీ జరిగినట్లు గమనించారు. ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
మహిళపై కత్తితో దాడి చేసిన యువకుడు
మఠంపల్లి : ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై యువకుడు కత్తితో దాడి చేసి గాయపర్చాడు. ఈ ఘటన మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది. ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటపల్లి గ్రామానికి చెందిన పుట్టపాకుల కోటమ్మ తన ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా.. అదే గ్రామానికి చెందిన షేక్ బడేమియా అలియాస్ రఫీక్ ఒక్కసారిగా ప్రహరీ దూకి వచ్చి కోటమ్మ గొంతుపై కత్తితో పొడిచాడు. దీంతో కోటమ్మ భయంతో కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చేసరికి బడేమియా కత్తిని అక్కడే వదిలేసి గోడ దూకి పారిపోయాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
షార్ట్ సర్క్యూట్‌తో
ఇల్లు దగ్ధం
కొండమల్లేపల్లి : విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు, ఇంట్లోని సామాగ్రి దగ్ధమయ్యాయి. కొండమల్లేపల్లి మండలంలోని కేశ్యతండాకు చెందిన రమావత్ నాను ఇంట్లో సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంట్లోని ధాన్యం, దుస్తులు, రూ.45వేల నగదు, ఇతర సామగ్రి దగ్ధమయ్యాయి. సుమారు రూ.5లక్షల మేర నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.


