వరి వద్దు.. కంది ముద్దు | - | Sakshi
Sakshi News home page

వరి వద్దు.. కంది ముద్దు

Jun 23 2026 7:43 AM | Updated on Jun 23 2026 7:43 AM

నేటి నుంచి రైతువేదికల్లో విత్తనమేళాలు

పెట్టుబడి, నిర్వహణ ఖర్చులు తక్కువ

ఆరుతడి పంటల వైపు ప్రోత్సహించేలా చర్యలు

ఎల్‌నినో ప్రభావంతో ప్రధానంగా కంది సాగుపై వ్యవసాయశాఖ దృష్టి

50 వేల ఎకరాల సాగే లక్ష్యం

నేటి నుంచి విత్తన మేళాలు

సాక్షి, యాదాద్రి, భువనగిరి: ఎల్‌నినో ప్రభావంతో ఈ వానాకాలంలో వర్షాభావ పరిస్థితులు పొంచి ఉన్న నేపథ్యంలో వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. నీటి అవసరం ఎక్కువగా ఉండే వరి, పత్తికి బదులుగా.. తక్కువ పెట్టుబడి, తక్కువ నీటితో మెరుగైన దిగుబడినిచ్చే కంది, ఇతర ఆరుతడి పంటల సాగును ప్రోత్సహిస్తోంది. ఈ సీజన్‌లో ఏకంగా 50 వేల ఎకరాల్లో కంది సాగు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం రైతులను సన్నద్ధం చేసేందుకు మంగళవారం నుంచి జిల్లావ్యాప్తంగా రైతువేదికల్లో ప్రత్యేక విత్తన మేళాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

తక్కవ వర్షపాతం ఉన్నా

నిలదొక్కుకుంటుందని..

జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 50 వేల ఎకరాల్లో కంది సాగు చేసేలా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి లక్ష్యంనిర్ణయించారు. 2026 వానాకాల వ్యవసాయ ప్రణాళికలో తొలుత కేవలం 5 వేల ఎకరాల్లో మాత్రమే కంది సాగు అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కంది సాగు టార్గెట్‌ను పదింతలు పెంచారు. తక్కువ వర్షపాతం ఉన్నా కంది పంట నిలదొక్కుకునే సామర్థ్యం ఉండటంతో రైతులకు ఇది భరోసానిచ్చే పంటగా అధికారులు పేర్కొంటున్నారు.

ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు జిల్లాలోని 36 రైతువేదికల్లో విత్తనమేళా నిర్వహించనున్నారు. ఇందులో ప్రభుత్వం సాగుకు సూచించిన ఏడు రకాల సన్న రకాల వరి విత్తనాలతో పాటు కంది, పెసర, మినుములు, కూరగాయలు ఇతర ఆరుతడి పంటల విత్తనాలను డీలర్లు రైతులకు అందుబాటులో ఉంచుతారు. నానో యూరియా, డీఏపీ ఎరువులు కూడా అందుబాటులో ఉంటాయి.

ఏడు రకాల సన్న వరి విత్తనాలు ఇవే..

తెలంగాణ సోన(ఆర్‌ఎన్‌ఆర్‌–15048).. ఈ పంట కాలం 120 నుంచి 125 రోజులు, సాంబ మసూరి(బీపీటీ–5204).. ఈ పంట కాలపరిమితి 145 నుంచి 150 రోజులు. కేఎన్‌ఎం(1638) రకం.. ఈ పంట కాలం 125 నుంచి 130 రోజుల వరకు ఉంటుంది. వ్యాధులను తట్టుకుంటుంది. హెచ్‌ఎంటీ సోన వరి రకం కాలపరిమితి135 నుంచి 145 రోజులు. దీనికి మంచి రుచి, అధిక ధర వస్తుంది. జై శ్రీరాం పంట కాలపరిమితి 125 నుంచి 135 రోజులు. ఇది అధిక దిగుబడి వస్తుంది. వానాకాలం, యాసంగి సీజన్లలో సాగుకు అనుకూలం. వీజీఎల్‌–44.. పంటకాలం 130 నుంచి 145 రోజులు. ఈ విత్తనం అన్ని నేలలకు అనుకూలం. కేఎన్‌ఎం(7715) రకం వరి విత్తనం కాల పరిమితి 125 నుంచి 130 రోజులు. దీనికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటుంది. విత్తన మేళాలో భాగంగా ఈ ఏడు రకాల వరి విత్తనాలపై విస్తృతంగా ప్రచారం చేసి వీటికే బోనస్‌ చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది.

కంది పంట విత్తిన తర్వాత సుమారు 100 రోజుల వరకు తేమ కొరతను తట్టుకునే గుణం కలిగి ఉంటుంది. ఆ తర్వాత వర్షాలు కురిసినా పంట కోలుకుని దిగుబడి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇతర పంటలతో పోలిస్తే పెట్టుబడి, నిర్వహణ ఖర్చులతో పాటు శ్రమ కూడా తక్కువగా అవసరమవుతుంది. అనుకూల పరిస్థితులు లేక పూత రాలిపోయినా మళ్లీ పూత వచ్చే స్వభావం ఉండటం రైతులకు అదనపు ప్రయోజనంగా మారనుంది. విత్తన రకాలను బట్టి ఎకరానికి 4 నుంచి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. దీంతో వర్షాభావ పరిస్థితుల్లో కంది పంట రైతులకు సురక్షిత ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు.

రైతులను ఆరుతడి పంటల వైపు ప్రోత్సహించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఆరుతడి పంటలకు సంబంధించిన కంది విత్తనాలు తగినన్ని అందుబాటులో ఉంచాలి. విత్తన మేళాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

–పీవీ రమణారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement