భువనగిరిటౌన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సోమవారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, వెంకారెడ్డితో కలిసి ప్రజల నుంచి 94 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 63, జిల్లా గ్రామీణాభివృద్ధి 8, మున్సిపాలిటీ 6, సర్వే ల్యాండ్ 6, జిల్లా పరిషత్ 2, ఈఈ ఆర్ అండ్ బీ 2, విద్య 2, ఏడీమైన్స్ , సంక్షేమ శాఖ, సోషల్ వెల్ఫేర్, ఎక్సజ్‌సైజ్, ప్రణాళికా శాఖలకు ఒక్కటి చొప్పున అర్జీలు వచ్చాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కల్పనా, జెడ్పీ సీఈఓ శోభారాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కూతురును ప్రభుత్వ బడిలో చేర్పించిన టీచర్
మోత్కూరు : మోత్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుడు ఎర్ర శంకర్ సోమవారం తన కుమార్తె ఎర్ర వర్షిణిని తాను పనిచేసే పాఠశాలలోనే 6వ తరగతిలో చేర్పించారు. విద్యార్థినికి ప్రధానోపాధ్యాయుడు అరవిందరాయుడు అడ్మిషన్ ఇచ్చారు. ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం వల్ల ప్రజలకు పాఠశాలపై విశ్వాసం కలుగుతుందని ప్రధానోపాధ్యాయుడు అన్నారు.
గురుకుల జూనియర్ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు
రామగిరి(నల్లగొండ) : మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లోని జూనియర్ కళాశాలల్లో ఖాళీ సీట్లలో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ బి.సంధ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలోని కళాశాలల్లో బైపీసీలో మిగిలిన నాలుగు సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. టెన్త్‌లో కనీసం 70శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన బాలురు ఈ స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అర్హత గల విద్యార్థులు మిర్యాలగూడ రోడ్డులోని ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయంలో నెల 24, 25 తేదీల్లో నిర్వహించే స్పాట్ అడ్మిషన్లకు హాజరుకావాలని సూచించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాలని పేర్కొన్నారు.
లక్కీ డ్రా ద్వారా ‘బెస్ట్ అవైలబుల్’ సీట్ల భర్తీ
భువనగిరిటౌన్ : జిల్లాలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) విద్యార్థుల కోసం 2026–27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఒకటో తరగతి (డే స్కాలర్ – ఇంగ్లిష్ మీడియం)లో సీట్ల భర్తీ ప్రక్రియ సోమవారం పూర్తయింది. జిల్లాకు కేటాయించిన 15 శాతం ఎస్సీ కోటా కింద మొత్తం 60 సీట్లకు గాను 69 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నూతన చట్టం ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అనుసరిస్తూ ఈ అడ్మిషన్లు చేపట్టారు. ఇందులో భాగంగా గ్రూప్–1 కేటగిరీలో 1 శాతం, గ్రూప్–2 కేటగిరీలో 9 శాతం, గ్రూప్–3 కేటగిరీలో 5 శాతం చొప్పున అడ్మిషన్లు కల్పించాలి. అయితే, గ్రూప్–2 లోని 9 శాతం కోటా కింద ఉన్న సీట్ల కోసం అత్యధికంగా 61 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ డ్రా ద్వారా గ్రూప్–2 కింద 36 మంది విద్యార్థులను సీట్లకు ఎంపిక చేశారు. ఎంపికై న వారు ఎవరైనా చేరని పక్షంలో, ఆ సీట్లను భర్తీ చేయడానికి అదనంగా మరో నలుగురు విద్యార్థులతో వెయిటింగ్ లిస్ట్‌కు కూడా డ్రా తీశారు.ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి జి.సురేష్, భువనగిరి సహాయ అధికారి సుమంత్, కార్యాలయ సూపరింటెండెంట్ యం.జ్యోతిర్మయి ఉన్నారు.


