జాతీయ రహదారిపై కంటైనర్‌ లారీ బోల్తా | - | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై కంటైనర్‌ లారీ బోల్తా

Jun 22 2026 7:09 AM | Updated on Jun 22 2026 7:09 AM

చౌటుప్పల్‌ : విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై చౌటుప్పల్‌ మండల పరిధిలోని ఖైతాపురం శివారులో ఆదివారం తెల్లవారుజామున భారీ కంటైనర్‌ లారీ బోల్తా పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రాజధాని చైన్నె నుంచి సోలార్‌ పవర్‌కు సంబంధించిన ప్యానెల్స్‌ లోడుతో కంటైనర్‌ లారీ హైదరాబాద్‌కు వెళ్తోంది. మార్గమధ్యలో చౌటుప్పల్‌ మండలం ఖైతాపురం గ్రామ స్టేజీ దాటిన తర్వాత ఎడమ వైపు నుంచి ఏదో వాహనం ఓవర్‌టేక్‌ చేస్తుండగా.. కంటైనర్‌ లారీ డ్రైవర్‌ ముందు జాగ్రత్తగా స్టీరింగ్‌ను కుడి వైపుకు తిప్పాడు. దీంతో వాహనం వేగంగా ఉండడంతో ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు మధ్యన డివైడర్‌ ఎక్కి హైదరాబాద్‌కు వెళ్లే మార్గంలో అడ్డంగా బోల్తా పడింది. బోల్తా పడిన కంటైనర్‌ లారీ పక్క నుంచే వెళ్లేందుకు యత్నించిన ఓ లారీ కంటైనర్‌కు తగిలి ఇరుక్కుపోయింది. దీంతో రోడ్డు పూర్తిగా బ్లాక్‌ అయ్యింది. దీంతో హైదరాబాద్‌ మార్గంలో ట్రాఫిక్‌ జాం అయ్యింది. చౌటుప్పల్‌ సీఐ మన్మథకుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. రెండు క్రేన్లు, జేసీబీల సహాయంతో కంటైనర్‌ లారీని రోడ్డు పక్కకు తొలగించారు. ట్రాఫిక్‌ జాంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

నిలిచిపోయిన వాహనాలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement