మాడుగులపల్లి : డీసీఎం ఢీకొనిద్విచక్ర వాహనదారుడు మృతిచెందాడు. ఈ ఘటన మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామంలో ఆదివారం జరిగింది. ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపిన విరవాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని ముత్తిరెడ్డికుంటకు చెందిన ప్రజ్ఞాపురం భిక్షపతి(49) స్కూటీపై మిర్యాలగూడ నుంచి నార్కట్‌పల్లికి వెళ్తుండగా.. మార్గమధ్యలో మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామానికి చేరుకోగానే డీసీఎం డ్రైవర్ అజాగ్రత్తగా నడుపుతూ స్కూటీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో భిక్షపతి కిందపడిపోగా అతడి తలపై నుంచి డీసీఎం వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య హేమలత ఫిర్యాదు మేరకు డీసీఎం డ్రైవర్ మహ్మద్ యాసిన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
గ్రామస్తుల ఆందోళన..
కుక్కడం గ్రామంలో అద్దంకి–నార్కట్‌పల్లి రహదారి ఇరుకుగా ఉండటంతోనే నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని కుక్కడం గ్రామస్తులు నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై సుమారు అర్ధగంట పాటు ఆందోళన చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ కృష్ణయ్య అక్కడికి చేరుకోని రోడ్డు వెడల్పు చేసేలా అధికారులతో మాట్లాడుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


