‘కవి భూషణ’గా పాండాల మహేశ్వర్‌ | - | Sakshi
Sakshi News home page

‘కవి భూషణ’గా పాండాల మహేశ్వర్‌

Jun 22 2026 7:09 AM | Updated on Jun 22 2026 7:09 AM

భూదాన్‌పోచంపల్లి : హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం తెలుగు భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మహతీ సాహితీ కవి సంగమం వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కవితలు, రచనల ద్వారా తెలుగు సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్న భూదాన్‌పోచంపల్లి మండలం గౌస్‌కొండ గ్రామానికి చెందిన కవి, ఉపాధ్యాయుడు పాండాల మహేశ్వర్‌ కవి భూషణ బిరుదుతో సత్కరించారు. ఆయనకు శాలువా కప్పి మెమొంటో అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహతీ సాహితీ కవి సంగమం అధ్యక్షుడు అడిగొప్పుల సదయ్య, ముక్కా సత్యనారాయణ, డీఎస్వీ మహాలక్ష్మి, నర్సింహశర్మ తదితరులు పాల్గొన్నారు.

పిడుగుపాటుతో గేదె మృతి

మద్దిరాల : పిడుగుపాటుకు గురై గేదె మృతిచెందింది. ఈ ఘటన మద్దిరాల మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగింది. ఆదివారం గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల మండల కేంద్రానికి చెందిన భూతం వీరయ్య తన పాడి గేదెను శనివారం సాయంత్రం తన వ్యవసాయ భూమిలోని పశువుల కొట్టం వద్ద కట్టేసి ఇంటికి వెళ్లాడు. రాత్రి ఉరుములు, మెరుపులతో భారీ వర్షంతో కురవగా.. పశువుల కొట్టం సమీపంలో పిడుగు పడడంతో గేదె మృతిచెందింది. మృతిచెందిన గేదె విలువ రూ.60వేలు ఉంటుందని, ప్రభుత్వం నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.

హత్యాయత్నం కేసులో

8 మంది అరెస్టు

మద్దిరాల : హత్యాయత్నం కేసులో 8 మందిని మద్దిరాల పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం డీఎస్పీ ప్రసన్నకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల మండలం చిన్ననెమిలా గ్రామానికి చెందిన నర్సయ్య భార్యతో అదే గ్రామానికి చెందిన కలంచర్ల మహేష్‌ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం నర్సయ్యకు తెలియడంతో భార్యను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. దీంతో నర్సయ్యపై కోపం పెంచుకున్న మహేష్‌ తన స్నేహితుడైన సూర్యాపేట రూరల్‌ పరిధి బాలెంల గ్రామానికి చెందిన గాలి వికాస్‌ సహాయంతో నర్సయ్యను హత్య చేయడానికి పథకం రచించాడు. ఈ క్రమంలో ఏప్రిల్‌ 2న గొర్రెలు మేపేందుకు వెళ్లిన నర్సయ్య తిరిగి ఇంటికి వెళ్తుండగా.. చిన్ననెమిలా గ్రామ శివారులో రామాలయం వద్ద అతడిని వికాస్‌తో పాటు అతడి స్నేహితులైన కాసరాబాద్‌ గ్రామానికి చెందిన రాచకొండ శివ, సూర్యాపేట పట్టణంలోని అన్నదురై నగర్‌కు చెందిన వేర్పుల అఖిల్‌కుమార్‌, పెద్ది లింగస్వామి అడ్డగించారు. మహేష్‌ పక్కనే చెట్ల మాటున దాక్కున్నాడు. వికాస్‌, అతడి స్నేహితులు బీరు సీసాలతో నర్సయ్య తలపై కొట్టి అక్కడి నుంచి అందరూ కలిసి కారులో పారిపోయారు. ఈ కేసు తమ మీదకు రాకుండా ఖమ్మంపాటి గోపిచంద్‌, కొత్త అరవింద్‌, కమటం సాయి అనే వ్యక్తులకు వికాస్‌ రూ.10వేల చొప్పున ఇవ్వగా వారు నేరం తమ మీద వేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మద్దిరాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఆదివారం చిన్ననెమిలా క్రాస్‌ రోడ్డు వద్ద ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.39వేల నగదు, 6 సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement