చిట్యాల : మండలంలోని తాళ్లవెల్లెంలలో బెల్ట్ షాపులలో మద్యం అమ్మకాలు పెరిగిపోయాయి. దీంతో ఆ గ్రామ యువత మద్యానికి అలవాటు పడి పనిపాట లేకుండా తిరుగుతూ వివాహాలు కాకుండా మిగిలిపోతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మద్యానికి బానిసలై కుటుంబాలను పట్టించుకోవటం లేదు. దీంతో గ్రామంలో బెల్ట్ షాపులను నివారించేందుకు గాను గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. గ్రామస్తుల అభ్యర్థన మేరకు తాళ్లవెల్లెంలలో బెల్ట్ షాపులు నిషేధించాలని పంచాయతీ పాలకవర్గం ఈనెల 10న తీర్మానం చేశారు.
ఇతర గ్రామాల నుంచి రాకతో..
మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపుల నిషేధంతో పాటు వైన్స్‌లలో మద్యం అమ్మకాలపై ప్రత్యేక సమయపాలనను పాటిస్తున్నారు. దీంతో పక్కనే ఉన్న తాళ్లవెల్లెంలలోని బెల్ట్ షాపులకు మునుగోడు నియోజవర్గంలోని ఐదారు గ్రామాల ప్రజలు నిత్యం మద్యం కోసం వస్తున్నారు. దీంతో ఇక్కడ బెల్ట్ షాపులలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతుండటంతో పాటు అప్పుడప్పుడు శాంతిభద్రతల సమస్య సైతం వస్తుంది. దీంతో గ్రామస్తుల అభ్యర్థన మేరకు గ్రామ సర్పంచ్ జోగు సురేష్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి శనివారం గ్రామంలో గ్రామస్తులు, మహిళలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఆదివారం నుంచి బెల్ట్ షాపులు నిర్వహించొద్దని గ్రామంలో డప్పు చాటింపు సైతం వేయించారు.
బెల్ట్ షాపులు నిర్వహించొద్దని
గ్రామ పంచాయతీలో తీర్మానం
ఆదివారం నుంచే అమలులోకి..


