సెల్‌టవర్‌ ఎక్కి యువకుడి హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

సెల్‌టవర్‌ ఎక్కి యువకుడి హల్‌చల్‌

Jun 22 2026 7:09 AM | Updated on Jun 22 2026 7:09 AM

భూదాన్‌పోచంపల్లి : భార్య కాపురానికి రావడంలేదని మద్యం మత్తులో సెల్‌టవర్‌ ఎక్కి యువకుడు హల్‌చల్‌ చేశాడు. ఈ ఘటన ఆదివారం భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లి పట్టణంలోని పాత హరిజనవాడకు చెందిన కరగల్ల బాలస్వామి ఆరేళ్ల క్రితం పెద్దగూడెంకు చెందిన ఒంటెద్దు బాలమణిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. జేసీబీ డ్రైవర్‌గా పనిచేసే బాలస్వామి నిత్యం మద్యం సేవించి భార్యను కొడుతుండేవాడు. ఇదిలా ఉండగా భార్య కూడా ఇతరులతో తరచూ ఫోన్‌లో మాట్లాతుండటం వల్ల ఇద్దరి మధ్య కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం భార్యాభర్తలు గొడవపడగా.. బాలమణి రాయితో బాలస్వామిని కొట్టడంతో తలకు గాయమైంది. అనంతరం పిల్లలను తీసుకొని బాలమణి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆదివారం ఉదయం బాలస్వామి మద్యం సేవించి తన భార్యను కాపురానికి తీసుకురావాలని పోచంపల్లి పట్టణంలోని ఇండియన్‌ పెట్రోల్‌ బంక్‌ ప్రక్కన ఉన్న సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐలు భాస్కర్‌రెడ్డి, లైలా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలస్వామి భార్యాపిల్లలను పిలిపించారు. కిందకు దిగిరావాలని ప్రాఽథేయపడగా.. కిందకి దిగుతున్నట్లు చేసి తిరిగి పైకి ఎక్కుతుండగా బిహార్‌కు చెందిన ఇద్దరు యువకులు చాకచక్యంగా టవర్‌ ఎక్కి అతడిని పట్టుకొని కిందికి తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. పోలీసులు స్టేషన్‌కు తరలించి భార్యాభర్తలిద్దరికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఇదిలా ఉండగా 11వ వార్డులో ఉన్న సెల్‌టవర్‌ కూడా బాలస్వామి ఎక్కగా.. టవర్‌ పైన కోతులు ఉండటంతో భయంతో కిందికి దిగివచ్చాడని స్థానికులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement