తండ్రి వెంకటసుబ్బారెడ్డి, తల్లి సావిత్రితో శ్రీకాంత్‌రెడ్డి
నల్లగొండ : మాది ఏపీలోని కడప జిల్లా చెన్నూరు. నాన్న వెంకటసుబ్బారెడ్డి, అమ్మ సావిత్రి. మాది సాధారణ కుటుంబం. నన్ను, చెల్లిని చదివించేందుకు ఎంతో కష్టపడ్డారు. మాకు ఆస్తిపాస్తులేమీ లేవు. నాన్న చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించారు. నాన్నకు అమ్మ తోడుగా నిలిచారు. మా నాన్న కుటుంబంలో పెద్దగా చదువుకున్నవారు లేరు. అందుకే మేమైనా ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి చేరాలని నాన్న ఎప్పుడూ కోరుకునేవారు. చిన్నప్పటి నుంచే చదువుపై దృష్టి పెట్టాలని, జీవితంలో ఉన్నత లక్ష్యాలు పెట్టుకోవాలని ప్రోత్సహించేవారు. పదో తరగతి వరకు కడపలో ప్రైవేట్ స్కూల్‌లో చదివాను. ఇంటర్‌మీడియట్ నెల్లూరులో పూర్తి చేసి జేఈఈ అడ్వాన్స్‌డ్ ద్వారా మధ్యప్రదేశ్‌లోని ఐఐటీ ఇండోర్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశాను. తర్వాత బెంగళూరులో రెండేళ్లు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు సిద్ధమయ్యాను. రెండు ప్రయత్నాల్లో ఇంటర్వ్యూ దశకు కూడా చేరుకోలేకపోయినా నిరాశ చెందలేదు.
త్యాగాల ఫలితమే ఈ విజయం..
తండ్రి చిన్న వ్యాపారాలు చేస్తూ, తల్లి అవసరమైన సందర్భాల్లో చీరల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని ముందుకు నడిపారు. వారిద్దరూ ఎన్నో కష్టాలు పడినా మా చదువులో మాత్రం ఎలాంటి లోటు రానీయలేదు. నాన్న చెప్పిన ‘మాకు చదువు లేదు.. మీరు గొప్పగా చదివి ఉన్నత స్థాయికి రావాలి’ అనే మాటలే నన్ను ముందుకు నడిపించాయి. మా చెల్లి శ్రీలత బీఎస్సీ బయోటెక్నాలజీ పూర్తిచేసి ప్రస్తుతం బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది.
మూడో ప్రయత్నంలో విజయం
సివిల్స్ సాధించాలన్న నా కలను నాన్న ఎప్పుడూ ప్రోత్సహించారు. మూడోసారి పూర్తిస్థాయిలో సిద్ధం కావడానికి ఉద్యోగాన్ని కూడా వదిలేశాను. ఆ సమయంలో కుటుంబం నుంచి, ముఖ్యంగా నాన్న నుంచి ఎంతో మద్దతు లభించింది. వారి ప్రోత్సాహమే నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఫలితంగా సివిల్స్‌లో మూడో ప్రయత్నంలో 151వ ర్యాంకు సాధించగలిగాను.
ప్రస్తుతం నల్లగొండ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్(ట్రైనీ)గా విధులు నిర్వహిస్తున్న నేను ఐఏఎస్ సాధించడంతో అమ్మానాన్నలు ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఇప్పటికీ నాన్న ఒకటే చెబుతుంటారు.. ‘ప్రజలకు నిజాయితీగా సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలి’ అని. ఆ మాటలే నాకు మార్గదర్శకం.
మంచి పేరు
తెచ్చుకోవాలని
నాన్న కోరిక..
ఫ చిన్నచిన్న వ్యాపారాలు చేసి మమ్మల్ని చదివించారు
ఫ ఆయన ప్రోత్సాహంతోనే సివిల్స్ సాధించాను
ఫ నిజాయితీగా సేవలందించాలనే సూచన తప్పక పాటిస్తా
నల్లగొండ అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) నెలటూరు శ్రీకాంత్‌రెడ్డి


