నల్లగొండ : ఈ వానాకాలం సీజన్‌లో రైతులకు ఎలాంటి ఎరువుల కొరత రానివ్వకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. శనివారం నల్లగొండలోని ఇందిర భవన్‌లో కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి మంత్రి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను ప్రారంభించి మాట్లాడారు. రైతులు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా ఎరువుల నిల్వలు, సరఫరా పరిస్థితి వంటి సమగ్ర సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చని చెప్పారు. ముఖ్యంగా యూరియా అవసరమున్న రైతులు యాప్ ద్వారా ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలన్నారు. పట్టాదారు పాస్‌పుస్తకం, పంట వివరాలను నమోదు చేసిన రైతుల పేరుపై ఎకరాకు రెండు బస్తాల చొప్పున యూరియా అందజేస్తామన్నారు. ఎకరం భూమి కలిగిన రైతులకు ఒకేసారి, ఒకటి నుంచి ఐదు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు విడతల వారీగా యూరియా పంపిణీ చేస్తామని వివరించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు యాప్ ద్వారా బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో సహకార సంఘాలు, డీసీఎంఎస్ కేంద్రాలు సహా 650కుపైగా విక్రయ కేంద్రాల్లో తగినంత యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, జిల్లాలో ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల మరమ్మతులకు, అవసరమైన చోట కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన పలు అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అలాగే ఆదివారం నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉపయోగించనున్న ప్రత్యేక టీషర్టులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వి.వినోద్ కుమార్, స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ వై.అశోక్ రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఫ నల్లగొండలో ఫర్టిలైజర్
బుకింగ్ యాప్ ప్రారంభం


