రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమం తప్పదు | - | Sakshi
Sakshi News home page

రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమం తప్పదు

Jun 21 2026 8:22 AM | Updated on Jun 21 2026 8:22 AM

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

నకిరేకల్‌: దేశానికి వెన్నెముకగా నిలిచిన తెలంగాణ రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని, రైతు వ్యతిరేక విధానాలు మానుకోకపోతే బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఉద్యమం తప్పదని నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. శనివారం నకిరేకల్‌లోని సువర్ణగార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు సకాలంలో యూరియా అందించడంలో, రైతు బంధు, బీమా పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి గతంలో అన్ని పంటలను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు కేంద్రం కోటా మేరకే కొనుగోలు చేస్తామని ప్రకటించడం రైతులను మోసం చేయడమేనన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందాలను చేసుకుందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పంటను చివరి గింజ వరకూ కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ పల్‌రెడ్డి మహిందర్‌రెడ్డి, తాటికల్‌ సర్పంచ్‌ బంటు రవి, నాయకులు గుండగోని జంగయ్యగౌడ్‌, రావిరాల మల్లయ్య, రాచకొండ వెంకన్నగౌడ్‌, పల్లె విజయ్‌, దైద పరమేశం, అమీర్‌పాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement