భువనగిరిటౌన్ : బాల్యం బక్కచిక్కిపోతోంది. చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి పోషకాహారమే కీలకమైనప్పటికీ, అంగన్‌వాడీ కేంద్రాల్లో పంపిణీలో జరుగుతున్న అలసత్వం వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది. తాజాగా జిల్లాలో నిర్వహించిన గ్రోత్ మానిటరింగ్ (పెరుగుదల పర్యవేక్షణ) పరీక్షల్లో వేలాది మంది చిన్నారులు వయసుకు తగ్గ ఎత్తు, ఎత్తుకు తగిన బరువు లేరని తేలడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపంతో ఆశించిన ఫలితాలు కనిపించడంలేదు.
901 కేంద్రాలు..
జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం ద్వారా 4 ప్రాజెక్టుల పరిధిలో 901 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా 3,814 మంది బాలింతలు, 4,999 మంది గర్భిణులు, 11,800 మంది (3 నుంచి 6 ఏళ్లలోపు) పిల్లలకు పోషకాహార పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా ఈ కేంద్రాల్లో తప్పనిసరిగా నిర్వహించే గ్రోత్ మానిటరింగ్ (పెరుగుదల పర్యవేక్షణ) పరీక్షల్లో చిన్నారుల శారీరక ఎదుగుదలలో లోపాలు విస్తుగొలుపుతున్నాయి. చాలా మంది చిన్నారులు వయసుకు తగ్గ ఎత్తు, ఎత్తుకు తగిన బరువు లేక కొట్టుమిట్టాడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి అంగన్‌వాడీ కేంద్రాల్లో అందుతున్న పోషకాహార నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని, లోపాలతో బాధపడుతున్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి.
ఫ 2వేల మందికి పైగా చిన్నారుల్లో శారీరక ఎదుగుదల లోపం
ఫ గ్రోత్ మానిటరింగ్ పరీక్షల్లో విస్తుగొలిపే నిజాలు
ఫ అంగన్‌వాడీ కేంద్రాల్లో పర్యవేక్షణ లోపం..
ఫ సత్ఫలితాలివ్వని ఆరోగ్యలక్ష్మి పథకం
గ్రోత్ మానిటరింగ్ పరీక్షల ప్రకారం లోపాల తీవ్రత ఇలా..
పోషకాహార లోపం కలిగిన పిల్లలు: 2,288 మంది
తీవ్ర పోషకాహార లోపం: 340 మంది
ఎత్తుకు తగిన బరువు లేకపోవడం: 2,288 మంది
తక్కువ బరువు: 614 మంది
వయసుకు తగిన ఎత్తు లేకపోవడం: 6,658 మంది
ఎత్తు లోపం: 1,560 మంది


