విత్తు మొలకెత్తాలని.. | - | Sakshi
Sakshi News home page

విత్తు మొలకెత్తాలని..

Jun 20 2026 12:36 PM | Updated on Jun 20 2026 12:36 PM

గుండాల : మండల కేంద్రానికి చెందిన రైతు మాదరబోయిన రాజు సుమారు 4 ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటారు. వర్షాలు లేకపోవడంతో స్ప్రింక్లర్లు అమర్చి రోజుకు 30 గుంటల చొప్పున తడుపుతూ పత్తి విత్తనాలను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

వన మహోత్సవానికి శ్రీకారం

భువనగిరి : పచ్చదనాన్ని పెంపొందించడమే ధ్యేయంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో హరిత సంకల్పానికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది వన మహోత్సవం లో భాగంగా జిల్లావ్యాప్తంగా రికార్డు స్థాయిలో 16.72 లక్షల మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలని జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నెల 18న చౌటుప్పల్‌లో మొక్కలు నాటే కార్యక్రమంతో ఈ బృహత్తర యజ్ఞాన్ని అధికారులు ప్రారంభించారు. వన మహోత్సవ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు గ్రామానికి మండల స్థాయి, మండలానికి జిల్లాస్థాయి అధికారులకు బాధ్యతలను అప్పగించారు.

వివిధ శాఖలకు కేటాయింపు

జిల్లాలోని గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో నర్సరీలను ఏర్పాటు చేశారు. ఉపాధి నిధులతో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 10వేల మొక్కలు పెంచుతున్నారు. అటవీశాఖ ద్వారా ప్రత్యేక నర్సరీలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరానికి వివిధ శాఖల ఆధ్వర్యంలో 16.72 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రభుత్వ భూముల్లో ఖాళీ ప్రదేశాలు, చెరువు కట్టలు, ప్రాజెక్టులు, అటవీ భూములు తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటనున్నారు. ప్రతి ఇంటికి పూలు, పండ్ల మొక్కలను పంపిణీ చేయనున్నారు.

అందుబాటులో ఉన్న మొక్కలు

వన మహోత్సవంలో భాగంగా నీడ, ఫలసాయం అందించే మొక్కలను నాటనున్నారు. నర్సరీల్లో టేకు, సుబాబుల్‌, కానుగ, చింత, మామిడి, నిమ్మ, జామ, దానిమ్మ, మునగ, అల్లనేరేడు, బొప్పాయి, బాదం, ఊసిరి, ఈత, మందార గులాబీ, అడవి తంగేడు, నిద్రగన్నేరు, వేప మొక్కలను అందుబాటులో ఉంచారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో పండ్ల మొక్కలను నాటనున్నారు.

సంరక్షణ చర్యలు చేపడితేనే..

గత ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి హరితహరం పేరుతో తొమ్మిది విడతలుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించింది. కానీ చాలాచోట్ల సంరక్షణ చర్యలు చేపట్టకపోవడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మొక్కలు ఎండిపోయాయి. ప్రస్తుతం వన మహోత్సవంలో నాటే మొక్కలకు సంరక్షణ చర్యలు తీసుకుంటే ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement