పెద్దవూర: మండలంలోని రామన్నగూడెం స్టేజీ సమీపంలో నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద స్థలాన్ని శుక్రవారం ఎస్పీ శరత్‌చంద్ర పవార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును, ప్రమాద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలు, ప్రమాదంలో చిక్కుకున్న వాహనల స్థితిగతులను, రహదారి పరిస్థితిపై ఆరా తీశారు. ఘటనకు సంబందించిన అన్ని వివరాలను సేకరించి, ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. అతివేగం, సీటు బెల్టు లేకుండా ప్రయాణించడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, వేగ పరిమితులు పాటించాలని, వాహనాలను ఓవర్‌టేక్ చేయడంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆయన వెంట స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ఆదిరెడ్డి, నాగార్జునసాగర్ సీఐ శ్రీనునాయక్, పెద్దవూర, నాగార్జునసాగర్ ఎస్‌ఐలు గోపాల్‌రావు, సతీష్ తదితరులున్నారు.


