భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్‌కు అంతర్జాతీయస్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సంప్రదాయ కళలు, హస్తకళల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పే క్రమంలో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనతో పాటు పోచంపల్లి ఇక్కత్ పట్టు శాలువా తీసుకెళ్లారు. దానిని శుక్రవారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యాన్యుయేల్ మాక్రాన్ సతీమణి బ్రిగెట్టి మాక్రాన్‌కు కానుకగా అందించారు. ఈ పట్టు శాలువాను భూదాన్‌పోచంపల్లికి చెందిన చేనేత కార్మికులు టై అండ్ డై పద్ధతిలో మగ్గంపై నేశారు. జ్యామితీయ పూల డిజైన్లు కల్గిన ఈ శాలువా ఆమెను ఎంతగానో ఆకట్టుకుంది. అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ చేనేత కళకు గౌరవం దక్కడం పట్ల స్థానిక చేనేత కళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. 2023లో కూడా ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణికి పోచంపల్లి ఇక్కత్ పట్టుచీరను బహుమతిగా అందించారు. తాజాగా రెండోసారి పోచంపల్లి పట్టు శాలువా ఇవ్వడం పోచంపల్లి ఇక్కత్ ఖ్యాతి మరింత పెరిగింది. గత నెలలో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో నిర్వహించిన 79వ కేన్స్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెలంగాణ ఇక్కత్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్ పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను ధరించి రెడ్‌కార్పెట్‌పై నడిచి ఇక్కత్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు.


