మిర్యాలగూడ టౌన్ : పిడుగుపాటుతో గొర్రెల కాపరి మృతి చెందిన సంఘటన మిర్యాలగూడ మండలంలో చోటు చేసుకుంది. తండావాసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం జేత్యాతండా గ్రామ పంచాయతీ పరిధిలోని సామ్యతండాకు చెందిన గొర్రెల కాపరి మాలోతు కోటయ్య(39) తన వద్ద ఉన్న గొర్రెలను మేపేందుకు గ్రామ సమీపంలోని పొలాల వద్దకు వెళ్లాడు. గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులు రావడంతో పాటు కురిసిన భారీ వర్షం పడుతుండడంతో కోటయ్య ఓ చెట్టు కిందకు వెళ్లాడు. అక్కడే ఒక్కసారిగా పిడుగు పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. గొర్రెలు ఇంటి చేరుకుని, కోటయ్య రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురై పొలాల వద్దకు వెళ్లారు. అక్కడ కోటయ్య మృతి చెంది ఉండడంతో కటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.
నాగారంబంగ్లాలో ఇద్దరికి గాయాలు
నాగారం : పిడుగుపాటుతో ఇద్దరికి గాయాలైన సంఘటన నాగారం మండలంలోని నాగారంబంగ్లాలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారంబంగ్లా గ్రామానికి చెందిన కన్నెబోయిన కుమార్, వర్ధమానుకోట గ్రామానికి చెందిన ఆవుల రమేష్‌లు తమ పనుల నిమిత్తం శుక్రవారం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి వస్తుండగా సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండడంతో వారిద్దరూ తాటి చెట్టు కిందకు వెళ్లారు. ఒక్కసారిగా పిడుగు పడడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. రమేష్ సూర్యాపేటలో, కుమార్ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు.


