విడాకులు కోరిన దంపతులు లోక్‌అదాలత్‌లో ఒక్కటయ్యారు | - | Sakshi
Sakshi News home page

విడాకులు కోరిన దంపతులు లోక్‌అదాలత్‌లో ఒక్కటయ్యారు

Jun 20 2026 12:36 PM | Updated on Jun 20 2026 12:36 PM

హుజూర్‌నగర్‌ : విడాకులు కోరిన దంపతులు హుజూర్‌నగర్‌ కోర్టులో నిర్వహించిన మెగా లోక్‌ అదాలత్‌లో ఒక్కటయ్యారు. మఠంపల్లి మండలం బోజ్యతండాకు చెందిన భూక్య కవితకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎన్‌టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురానికి చెందిన భూక్య లక్ష్మీనరసింహతో 2019లో వివాహమైంది. వీరికి శరణ్య, శ్రీకర్‌ ఇద్దరు సంతానం. ఆ తర్వాత భార్యభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడి విడిపోయారు. రెండేళ్లుగా విడివిడిగా జీవిస్తున్నారు. తనకు విడాకులు మంజూరు చేయాలని కోరుతూ లక్ష్మీనరసింహ సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో కవితపై విడాకుల కేసు దాఖలు చేశారు. ఆ కేసు విచారణలో ఉండగా శుక్రవారం రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి శివరామ ప్రసాద్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి నక్కా శ్యాంసుందర్‌, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఆయేషా సరీన్‌లు ఈ కేసులో చొరవ తీసుకొని దంపతులు ఇరువురితో ముఖాముఖిగా మాట్లాడారు. భవిష్యత్‌లో జరుగబోయే దానిపై ఇద్దరికి నచ్చజెప్పారు. దీంతో వారు ఇరువురు తిరిగి కలిసి సంసారం కొనసాగించడానికి అంగీకరించారు. న్యాయమూర్తులు వారితో పూలదండలు మార్పించి శుభాకాంక్షలు తెలిపారు. వారిద్దరి మధ్య రాజీకి న్యాయవాదులు బానోతు సురేష్‌ కుమార్‌, కొణతం శ్రీనివాస రెడ్డి సహకరించారు.

అక్రమంగా మట్టి తవ్విన వారిపై కేసు

హుజూర్‌నగర్‌ : పొలంలోకి అక్రమంగా ప్రవేశించి మట్టిని తవ్విన వారిపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. హుజూర్‌నగర్‌ మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన యరసాని నాగిరెడ్డి భార్య సుగుణమ్మ పేరిట సర్వే నంబర్‌ 126లో 1.09 ఎకరాల పొలం ఉంది. పొలం యజమానులు లేని సమయంలో కొందరు జేసీబీలను తీసుకొచ్చి గుంతలు తీసి మట్టి కుప్పగా పోశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు.

గడ్డివాము దగ్ధం

మునుగోడు: విద్యుత్‌ వైర్లు తెగి గడ్డివాముపై పడటంతో మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. మునుగోడు మండలంలోని చొల్లేడు గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన వీరమళ్ల యాదయ్య తన వ్యవసాయ బావి వద్ద పశువుల గ్రాసం కోసం 500 మోపుల గడ్డివాము వేశాడు. పెద్ద ఎత్తున గాలితో పాటు వర్షం కురవడంతో గాలికి విద్యుత్‌ తీగలు తెగి గడ్డివాముపై పడి మంటలు లేచాయి. గమనించిన స్థానిక రైతులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. గడ్డివాము పూర్తిగా దగ్ధం కావడంతో దాదాపు రూ.60వేలకు పైగా నష్టం వాటిట్టిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు.

ప్రభుత్వ బడికి సర్పంచ్‌,

ఉప సర్పంచ్‌ కుమార్తెలు

కేతేపల్లి : మండలంలోని ఉప్పలపహాడ్‌ గ్రామ సర్పంచ్‌ ఏర్పుల నాగరాజు, కాసనగోడు ఉప సర్పంచ్‌ వెంకటేష్‌ శుక్రవారం తమ కుమార్తెలను ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. సర్పంచ్‌ నాగరాజు కుమార్తె రియా స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతిలో అడ్మిషన్‌ తీసుకోగా, ఉప సర్పంచ్‌ వెంకటేష్‌ కూతురు దుర్గశ్రీని ప్రీ ప్రైమరీ పాఠశాలలో చేర్పించారు. సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడంపై ఎంఈఓ కె.భిక్షమయ్య హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement