ఫ 15 ఏళ్లుగా పక్షులను
సంరక్షిస్తున్న మహమ్మద్ గఫార్
ఫ ఇంటిపై ప్రత్యేకంగా
ఆహారం, నీటి తొట్లు ఏర్పాటు
రామగిరి(నల్లగొండ): పక్షులకు గూడు దొరకడమే కష్టంగా మారిన ప్రస్తుత తరుణంలో నల్లగొండ పట్టణానికి చెందిన మహమ్మద్ గఫార్ ఖాన్ వాటి పట్ల అపారమైన మానవత్వం చాటుకుంటున్నారు. తన ఇంటిపై పక్షుల కోసం ప్రత్యేకంగా ఆహారపు తొట్లు ఏర్పాటు చేసి 15 సంవత్సరాలుగా వాటికి ఆశ్రయం కల్పిస్తూ పక్షుల ఆకలి తీరుస్తున్నారు. వాటి దాహం తీర్చేందుకు నీటి తొట్టెలను కూడా పెట్టించాడు.
పక్షుల కిలకిల రాగాలు..
గఫార్ ఏర్పాటు చేసిన ఆహారం తొట్ల వల్ల ప్రతిరోజూ ఉదయం పక్షుల కిలకిల రాగాలు వినిపిస్తుంటాయి. పింఛ్ బర్డ్స్, పావురాలు, ఇతర రకాల పక్షులు వందల సంఖ్యలో ఇక్కడికి వస్తుంటాయి. పక్షుల సంరక్షణకు సంవత్సరానికి సుమారు రూ. 36,000 వరకు ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక భారమైనప్పటికీ, పక్షుల ఆకలి తీర్చడంలో వచ్చే తృప్తి ముందు ఈ ఖర్చు చాలా చిన్నదని ఆయన భావిస్తున్నారు.
పక్షులను కాపాడుకోవడం మన బాధ్యత. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పక్షులకు సరైన ఆవాసం ఆహారం లేక మృత్యువాత పడుతున్నాయి. ఇంటిపైన ఆహారపు, నీటి తొట్లను ఏర్పాటు చేస్తే పక్షులను సంరక్షించిన వారమవుతాం.
– మహమ్మద్ గఫార్ ఖాన్


