ఏసీబీకి పట్టుబడ్డ సర్వే డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీకి పట్టుబడ్డ సర్వే డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌

Jun 20 2026 12:36 PM | Updated on Jun 20 2026 12:36 PM

నల్లగొండ: భూ సర్వే నివేదిక జారీ చేయడానికిగాను లంచం తీసుకుంటుండగా ససర్వే డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ జగదీశ్‌చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ రెవెన్యూ డివిజనల్‌ అధికారి కార్యాలయంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌గా పవన్‌ కుమార్‌ పనిచేస్తున్నారు. ఓ ఫిర్యాదుదారుడి తల్లి, అత్తకు సంబంధించిన భూముల సర్వే నివేదిక జారీ చేయడానికి పవన్‌ కుమార్‌ రూ.35 వేలు డిమాండ్‌ చేశాడు. ఇందులో భాగంగా గతంలోనే రూ.20 వేల అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. మిగిలిన రూ.15 వేలు శుక్రవారం కలెక్టరేట్‌ సమీపంలో స్వీకరిస్తుండగా ఏసీబీ నల్లగొండ రేంజ్‌ అధికారులు పట్టుకున్నారు. అతడి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పవన్‌కుమార్‌ను అరెస్టు చేసి నాంపల్లిలోని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనున్నట్లు చెప్పారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

వ్యక్తి అదృశ్యం

మిర్యాలగూడ టౌన్‌ : వ్యక్తి అదృశ్యమైన సంఘటన మిర్యాలగూడ మండలంలో చోటు చేసుకుంది. మిర్యాలగూడ రూరల్‌ ఎస్‌ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం ఖానాపురం గ్రామానికి చెందిన మహమ్మద్‌ మాజీద్‌ అనే వ్యక్తి పశువైద్య శాలలో సబార్డినేట్‌గా పని చేస్తున్నాడు. తన అత్త ఊరు అయిన మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లి గ్రామానికి 20 రోజుల క్రితం వచ్చాడు. ఈ నెల 16న మధ్యాహ్నం 3గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన మాజీద్‌ తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో శుక్రవారం మిర్యాలగూడ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. ఆయన భార్య కరీష్మా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఆచూకీ తెలిస్తే 87126 70189కు సమాచారం అందించాలని కోరారు.

200 కోళ్లు మృతి

హుజూర్‌నగర్‌ : మండలంలోని లింగగిరి గ్రామానికి చెందిన ఎస్‌కే అబ్దుల్లా పెంచుతున్న దాదాపు 200 కోళ్లు, కోడి పిల్లలు శుక్రవారం మృతి చెందాయి. ఈవిషయమై అబ్దుల్లా పోలీసులకు, పశువైద్యాధికారులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి పంచనామా చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు. కోళ్ల కళేబరాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు పశువైద్యాధికారి మమత తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement