ఫ 20న ఆలేరులో ప్రారంభించనున్న మంత్రి సీతక్క
ఆలేరు:ఽ ఆలేరు పట్టణంలో రూ.50లక్షల సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించిన దుర్గాభాయి మహిళా శిశు వికాస కేంద్రం(మహిళా ప్రాంగణం) ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 20న ఈ కేంద్రం ప్రారంభోత్సవానికి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క రానున్నారు. ఇందులో భాగంగా గురువారం జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావు ఈ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో ఎంపీడీఓ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. మంత్రి పర్యటన నేపథ్యంలో కార్యక్రమ నిర్వహణ, పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు తదితర అంశాలపై శాఖల వారీగా బాధ్యతలను అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ సత్యాంజనేయ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌డీఓ పాల్గొన్నారు.
ఆయిల్‌పామ్ సాగుతో స్థిరమైన ఆదాయం
సాక్షి యాదాద్రి : ఆయిల్‌పామ్ సాగుతో 30 ఏళ్లపాటు స్థిరమైన ఆదాయం పొందవచ్చని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. గురువారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా ఉద్యాన శాఖకు సంబంధించిన పథకాలు, 2026–27 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఆయిల్‌పామ్ మొక్కలు నాటిన తర్వాత నాలుగవ ఏడాది నుంచి కాపు మొదలైతుందన్నారు. ఎకరానికి సుమారు 10 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుందని త ద్వారా సంవత్సరానికి ఎకరానికి సుమారు రూ. 1,20,000నుంచి రూ. 1,50,000 వరకు నికర ఆదాయం పొందవచ్చని వివరించారు. సమావేశంలో జిల్లా ఉద్యాన అధికారి కె. హేమలత, ఉద్యాన అధికారులు పాల్గొన్నారు.
పంట మార్పిడి చేయాలి
సాక్షి యాదాద్రి : ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున రైతులు పంట మార్పిడి వైపు మొగ్గు చూపాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. గురువారం వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులతో కలెక్టరేట్ నుంచి నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.జిల్లాలో 47,000 ఎకరాల్లో కంది సాగు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వరి లో సన్న రకాలనే సాగు చేయాలని కోరారు. ఎకరాకు 2 బస్తాల యూరియా పంపిణీ కోసం రూపొందించిన యూరియా యాప్ పై రైతుల్లో అవగాహన పెంచాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు భాస్కర్ రావు, వెంకట్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి రమణా రెడ్డి, ఉద్యాన అధికారిణి హేమలత పాల్గొన్నారు.
25 మందికి ఉద్యోగ నియామక పత్రాలు
భువనగిరి: భువనగిరి పట్టణంలోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో గురువారం మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. 5 ప్రైవేట్ కంపెనీలుపాల్గొన్న ఈ ప్లేస్‌మెంట్ ప్రోగ్రాంకు 53 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 25 మంది ఎంపిక కాగా వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధికల్పానాధికారి ఎన్.పద్మ, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎన్జీ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల
రామగిరి(నల్గొండ): నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉపేందర్ రెడ్డి, ఎన్జీ కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి మునిస్వామి ఈ ఫలితాలను విడుదల చేశారు. డిగ్రీ 2వ, 4వ, 6వ రెగ్యులర్ సెమిస్టర్లతో పాటు 1వ, 3వ, 5వ సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ ఫలితాలను కూడా వెల్లడించారు. రెగ్యులర్, బ్యాక్‌లాగ్ విద్యార్థులు కలిపి మొత్తం 68శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పరంగి రవికుమార్, అకడమిక్ కోఆర్డినేటర్లు నాగరాజు, శ్రీనివాసరెడ్డి, ఎగ్జామ్ బ్రాంచ్ మెంబర్ కోటయ్య పాల్గొన్నారు.


