యాదగిరిగుట్ట రూరల్: కాంగ్రెస్, బీజేపీలు బీఆర్‌ఎస్ ఓట్లను తొలగించడానికి కుట్ర చేస్తున్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. గురువారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆలేరు నియోజకవర్గ స్థాయి సర్ సర్వే బూత్ ఏజెంట్ల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతీ ఎన్నికలకు ముందు ఓటర్లకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ సర్వేను నిర్వహిస్తారన్నారు. ఈ క్రమంలో బీఎల్‌ఓలు ఇంటికి వచ్చిన సమయంలో బీఆర్‌ఎస్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఎల్‌ఓల వెంటనే ఉండి, ఓట్లను తొలగించకుండా చూసుకోవాలన్నారు. నోటీసులు ఇవ్వకుండా ఓట్లు తొలిగించే హక్కు ఏ అధికారికీ లేదన్నారు. గతంలో 2002 లో ఈ సర్వే జరిగిందని, అప్పుడు చాలా మందికి ఓట్లు లేవని, ఇప్పుడు ఉన్నాయని, ఆ సాకుతో ఓట్లను తొలగిస్తారన్నారు. 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ చేస్తారని తెలిపారు. రాష్ట్రంలో పరిపాలన మూర్ఖుడి చేతిలో ఉందని, దుర్మార్గమైన పాలన నడుస్తోందని, ప్రతీ స్కీమ్‌లో స్కామే ఉందని విమర్శిచారు. చంద్రబాబు, నరేంద్ర మోదీల హైబ్రిడ్ సీఎం.. తెలంగాణ సీఎం అని ఎద్దేవా చేశారు. రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే అని, పార్టీ శ్రేణులు నిక్కచ్చిగా పనిచేయాలని తెలియజేశారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, రాజ్య సభమాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, కల్లూరి రాంచంద్రారెడ్డి, క్యామ మల్లేష్, జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి


