ఆటోలో బ్యాగు మర్చిపోయిన ప్రయాణికురాలు | - | Sakshi
Sakshi News home page

ఆటోలో బ్యాగు మర్చిపోయిన ప్రయాణికురాలు

Jun 19 2026 2:12 AM | Updated on Jun 19 2026 2:12 AM

పోలీసులకు అప్పగించిన డ్రైవర్‌

కోదాడరూరల్‌ : ఆటోలో ప్రయాణికురాలు మర్చిపోయిన బ్యాగును పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు ఆటో డ్రైవర్‌. వివరాలు.. చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెం గ్రామానికి చెందిన షేక్‌ లాల్‌సాహెబ్‌ కోదాడ పట్టణంలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం తన ఆటోలో ఎక్కిన ప్రయాణికురాలు బ్యాగు మర్చిపోయి దిగింది. కొద్దిదూరం వెళ్లిన తర్వాత ఆటోలో బ్యాగును గుర్తించిన లాల్‌సాహెబ్‌ ఆ బ్యాగును తీసుకొచ్చి కోదాడ పట్టణ పోలీసులు అప్పగించారు. పోలీసులు బ్యాగులో లభించిన వివరాల ఆధారంగా ప్రయాణికురాలిని గుర్తించి వారికి బ్యాగును అందజేశారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్‌ లాల్‌సాహెబ్‌ను పోలీసులు అభినందించారు.

భువనగిరి ఖిలాను

సందర్శించిన కెనడా దేశస్తులు

భువనగిరి : హైదారాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో భాగస్వామ్యం ఉన్న కెనడా దేశానికి చెందిన 8 మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు గురువారం భువనగిరి ఖిలాను సందర్శించారు. ఈ సందర్భంగా ఖిలాపై రాజాప్రసాదం, నీటి కొలనులు, ఏనుగు, గుర్రపు శాలలను తిలకించారు. ఖిలా పైకి వెళ్లే ప్రవేశ ద్వారాలను ఫొటోల్లో బంధించారు. ఏకశిలపై కోట నిర్మాణం అద్భుతంగా ఉందని కొనియాడారు.

మహిళ మెడలో

పుస్తెలతాడు అపహరణ

ఆలేరురూరల్‌ : మహిళ మెడలోని పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తి అపహరించాడు. ఈ ఘటన ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో గురువారం జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లూరు గ్రామానికి చెందిన అంబాల జయమ్మ గురువారం ఉదయం తన ఇంటి బయట ఊడుస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తి వెనుక నుంచి వచ్చి ఆమె మెడలోని ముడున్నర తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని పారిపోయాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చేసరికి దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ వినయ్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement