ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు బకాయి రూ.కోటిపైనే | - | Sakshi
Sakshi News home page

ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు బకాయి రూ.కోటిపైనే

Jun 18 2026 7:58 AM | Updated on Jun 18 2026 7:58 AM

ప్రత్యేక టీం ఏర్పాటు చేశాం

భువనగిరిటౌన్‌ : భువనగిరి మున్సిపాలిటీలో వ్యాపార లైసెన్స్‌ ఫీజు వసూళ్లు పడకేశాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో వ్యాపారుల లైసెన్స్‌ ఫీజు చెల్లించడం లేదు. పట్టణ పరిధిలో వ్యాపార సంస్థలు నడుపుతూ మున్సిపాలిటీ నుంచి అన్నిరకాల మౌలిక వసతులు పొందుతున్న కొందరు వ్యాపారులు ప్రభుత్వానికి ఫీజు చెల్లించకున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఫలితంగా రూ.కోటికిపైనే బకాయిలు పేరుకుపోయి మున్సిపల్‌ ఖజానాకు భారీగా గండిపడుతోంది.

రికార్డుల్లో 1,853 ట్రేడ్‌ లైసెన్స్‌లు

మున్సిపల్‌ రికార్డుల ప్రకారం భువనగిరి పట్టణంలో గతంలో 1,853 ట్రేడ్‌ లైసెన్సులు జారీ అయ్యాయి. అయితే ప్రస్తుతం క్షేత్రస్థాయిలో దాదాపు 300కుపైగా దుకాణాలు మూతపడినట్లు మున్సిపల్‌ అధికారులు చెబుతున్నారు. మిగిలిన దుకాణాల నుంచి నిబంధనల ప్రకారం ఏటా వ్యాపార ఫీజు వసూలు చేయాల్సి ఉన్నా, ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. అయితే గడిచిన 2025–2026 ఆర్థిక సంవత్సరానికి గాను పట్టణంలో రూ.1.40 కోట్ల వ్యాపార ఫీజు వసూలు కావాల్సి ఉండగా దాదాపు రూ.1.05 కోట్లకుపైగా బకాయిలు నిలిచిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా గతేడాది డిమాండే ఉండగా ఇప్పటి వరకు రూ.6 లక్షలు మాత్రమే వసూలు కావడం గమనార్హం.

నోటీసులు అందించని యంత్రాంగం

పట్టణంలోని వ్యాపార సంస్థల ముందు సీసీ రోడ్ల నిర్మాణం, డ్రెయినేజీలు, వీధిదీపాల ఏర్పాటుతో పాటు రోజూ దుకాణాల నుంచి మున్సిపల్‌ సిబ్బంది చెత్తను సేకరిస్తున్నారు. ఇందుకోసం మున్సిపాలిటీ భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. పట్టణంలోని సుమారు 15కు పైగా ప్రముఖ ప్రైవేట్‌ ఆసుపత్రుల యజమానులు, పలు పెట్రోల్‌ బంకుల నిర్వాహకులు, వస్త్ర దుకాణాల యజమానులు తాము వ్యాపార లైసెన్స్‌ ఫీజు చెల్లించేది లేదని మున్సిపల్‌ అధికారులు, సిబ్బందితో తెగేసి చెబుతున్నట్లు సమాచారం. ఎగవేతదారులు ఎక్కువవుతున్నా మున్సిపల్‌ అధికారులు నోటీసులు ఇవ్వడానికి, దుకాణాలు సీజ్‌ చేయడానికి వెనుకడుగు వేయడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ప్రజాసంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల ఉదాసీనత వల్లే మున్సిపాలిటీ ఆదాయం కోల్పోతోందని, ఫలితంగా పట్టణ అభివృద్ధికి నిధుల కొరత ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసి వ్యాపార లైసెన్స్‌ ఫీజు వసూలు చేయాలని, బకాయిలు చెల్లించని వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు వసూలు కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేశాం. బకాయిలు కూడా వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. రెండు, మూడు రోజుల్లో పెద్ద ఎత్తున్న బకాయి ఉన్న వారిని గుర్తించి నోటీసులు అందజేస్తాం.

– చంద్రప్రకాశ్‌రెడ్డి,

మున్సిపల్‌ కమిషనర్‌, భువనగిరి

ఫ భువనగిరి మున్సిపాలిటీలో వసూలు అంతంతే..

ఫ అధికారుల ఉదాసీనతతో రెండేళ్లుగా మందగించిన ప్రక్రియ

ఫ సౌకర్యాలు పొందుతూ ఫీజు చెల్లించని వ్యాపారులు

ఫ ఆసుపత్రులు, పెట్రోల్‌ బంకుల నిర్వాహకులు కూడా..

ఫ మున్సిపల్‌ ఖజానాకు భారీగా గండి

ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు వసూలు ఇలా..

ఆర్థిక సంవత్సరం వసూలు కావాల్సింది అయ్యింది

2025–2026 రూ.1.40 కోట్లు రూ.34.74 లక్షలు

2026–2027 రూ.1.40 కోట్లు రూ.6 లక్షలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement