సాక్షి, యాదాద్రి : ఎయిమ్స్‌లో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని భువనగిరి ఎంపీ చామలకిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఎయిమ్స్ ఆవరణలో మౌలిక వసతుల కల్పన, నూతన ప్రాజెక్టుల పురోగతిపై స్టాండింగ్ ఎస్టేట్ కమిటీ అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీతోపాటు ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ అమితా అగర్వాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఫేజ్–1లో చేపట్టిన ఎయిమ్స్ భవన సముదాయం పనులు త్వరగా పూర్తిచేయాలని కోరారు. గుర్తింపు పొందిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఎయిమ్స్‌లో ప్రత్యేకంగా సదుపాయలు కల్పించాలని డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో ప్రారంభించే నూతన బ్లాక్‌లో జర్నలిస్టులకు ప్రత్యేక వైద్య సదుపాయం కల్పిస్తానని డైరెక్టర్ అమితా అగర్వాల్ హామీ ఇచ్చినట్లు ఎంపీ చెప్పారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సహాయకులుగా వచ్చే వారికోసం విశ్రామ్ సదన్ నిర్మాణం అందుబాటులోకి తేవాలని కోరారు. ఈ సమావేశంలో స్టాండింగ్ ఎస్టేట్ కమిటీ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ డా. శైలేంద్ర హండు, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్.మూర్తి, ప్రొఫెసర్ డాక్టర్ తీర్థంకర్ దేబ్, ప్రత్యేక ఆహ్వానితులుగా మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహేశ్వర్ లక్కిరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ రాజనీష్ మిశ్రా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.శశికుమార్ పాల్గొన్నారు.
ఫ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ చామల


